Cotton Swabs | శరీరంలో ఇతర భాగాలను శుభ్రపరుచుకున్నట్టే మనం చెవులను కూడా శుభ్రం చేస్తూ ఉంటాం. చెవులలో ఉండే ఇయర్ వాక్స్ ను తొలగించడానికి మనం సాధారణంగా ఇయర్ బడ్స్ ను లేదా కాటన్ స్వాబ్ లను వాడుతూ ఉంటాం. వీటిని వాడడం వల్ల చెవులు పూర్తిగా శుభ్రపడతాయి అని భావిస్తూ ఉంటాం. కానీ చెవి లోపలికి కాటన్ స్వాబ్ లను పెట్టడం వల్ల చెవులు శుభ్రపడడానికి బదులుగా మనకు హాని ఎక్కువగా కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ అలవాటు వివిధ సమస్యలకు, ఇన్పెక్షన్లకు దారి తీస్తుందని వారు తెలియజేస్తున్నారు. చెవులను శుభ్రపరచడానికి కాటన్ స్వాబ్స్ ను అస్సలు ఉపయోగించకూడదని, ఇవి చెవులను శుభ్రపరచడానికి బదులుగా చెవుల్లో ఉండే వ్యాక్స్ ను మరింత లోపలికి నెడతాయని వారు చెబుతున్నారు.
ఈ వ్యాక్స్ మరింత లోపలికి వెళ్లడం వల్ల నొప్పితో పాటు ఇన్పెక్షన్ లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది క్రమంగా చెవిపోటుకు కారణమవుతుంది. అలాగే ఇయర్ బడ్స్ ను చెవి లోపలికి పెట్టడం వల్ల చెవి లోపల ఉండే సున్నితమైన చర్మం దెబ్బతింటుంది. ఫలితంగా వినికిడి లోపం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అదే విధంగా శుభ్రపరచని వస్తువులు, పిన్నులు వంటి వాటితో చెవులను శుభ్రం చేయడం వల్ల చెవిలోకి బ్యాక్టీరియా ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఈ బ్యాక్టీరియా ఇన్పెక్షన్ లకు దారి తీస్తుందని దీని వల్ల నొప్పి, వాపు వంటి సమస్యలు కూడా వస్తాయని వైద్యులు చెబుతున్నారు.
తరచూ ఇయర్ బడ్స్ ను వాడడం వల్ల చెవిలో అసౌకర్యం, చికాకు, మంట కూడా వస్తుంది. 70 శాతం కంటే ఎక్కువ చెవి గాయాలు కాటన్ స్వాబ్స్ ను ఉపయోగించడం వల్లనే జరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఇక చెవులను మనం శుభ్రం చేసుకోవాల్సిన అవసరం లేదని చెవులు స్వయంగా వాటిని అవే శుభ్రపరుచుకుంటాయని వారు తెలియజేస్తున్నారు. చెవిలో ఉండే వ్యాక్స్ చెవులను దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా నుండి రక్షిస్తుంది. సహజంగా దానికదే బయటకు వెళ్తుంది. దానిని మనం ప్రత్యేకంగా శుభ్రం చేయాల్సిన పని లేదు.
చెవిలో గులిమి ఎక్కువగా ఉండడం వల్ల నొప్పి, వినికిడి లోపం వంటి సమస్యలు వస్తాయి. ఇలాంటి సమస్యలను గమనించిన వెంటనే సొంతంగా ఇయన్ బడ్స్ ను ఉపయోగించి శుభ్రం చేసుకోవడానికి బదులుగా వైద్యుడి వద్దకు వెళ్లాలి. వైద్యులు సురక్షితమైన సాధనాలను ఉపయోగించి గులిమిని తొలగిస్తారు. చెవులల్లో గులిమిని తొలగించడానికి ఇయర్ బడ్స్ లేదా కాటన్ స్వాబ్స్ వంటి వాటిని అస్సలు ఉపయోగించకూడదు. చెవిలో గులిమి దానంతట అదే బయటకు వస్తుంది. కాటన్ స్వాబ్స్ వంటి వాటిని ఉపయోగించడం వల్ల లాభానికి బదులుగా నష్టమే ఉంటుంది.