న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసు విచారణ నుంచి తనను తప్పించాలని కోరుతూ ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ స్వరణకాంత శర్మ నేతృత్వంలోని ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. ఈ వివాదాన్ని జస్టిస్ శర్మ సూటిగా వివరిస్తూ తనది కేసు నుంచి వైదొలగలేని సంక్లిష్టమైన పరిస్థితని, అదే ఆప్ అధినేతది ఓడినా గెలిచినా తనదే పైచేయి అని చెప్పుకొనే పరిస్థితని వర్ణించారు. విచారణ నుంచి తాను వైదొలగాలని దాఖలైన పిటిషన్లను తిరస్కరించారు. తనకు, మనీష్ సిసోడియా, కల్వకుంట్ల కవిత వంటి ఇతర నిందితులకు ఉపశమనం నిరాకరించడం సహా న్యాయమూర్తి గతంలో ఇచ్చిన ప్రతికూల ఉత్తర్వులు పక్షపాతాన్ని సూచిస్తున్నాయని ఆప్ అధినేత వాదించారు. న్యాయమూర్తి పిల్లలు కేంద్ర ప్రభుత్వ న్యాయవాదులుగా ఎంప్యానెల్ అయ్యారని పేర్కొంటూ, తీర్పులో రాజీపడే అవకాశం ఉందని ఆయన ఆరోపించారు. జస్టిస్ శర్మకు బీజేపీ అనుబంధ సంస్థలతో అనుబంధం ఉందని ఆరోపించారు. కేజ్రీవాల్ అదనపు వాదనలను రికార్డులో నమోదు చేసిన జస్టిస్ శర్మ తాను వైదొలగాలనే అభ్యర్థనలకు చెందిన చట్టపరమైన, సంస్థాగత పర్యవసానాలను ప్రస్తావించారు.
ఇప్పుడు ఈ కేసు నుండి నేను వైదొలగాలని కోరడం ఒక చిక్కుముడి లాంటి పరిస్థితి. ఈ కేసులో నేను వైదొలగినా, వైదొలగకపోయినా ప్రశ్నలు తలెత్తే స్థితిలో నన్ను ఉంచారు. దరఖాస్తుదారు(కేజ్రీవాల్) తనకు అనుకూలమైన పరిస్థితిని సృష్టించుకున్నారు. అని జస్టిస్ శర్మ పేర్కొన్నారు. ఒకవేళ ఆయనకు(కేజ్రీవాల్) ఉపశమనం లభించకపోతే తాను ఫలితాన్ని ముందే ఊహించానని చెప్తారు. ఒకవేళ ఉపశమనం లభిస్తే కోర్టు ఒత్తిడికి లోనై వ్యవహరించిందని చెప్పవచ్చు. తన కథనానికి అనుకూలంగా పరిస్థితిని ఏ విధంగానైనా చిత్రీకరించవచ్చు. కేసు నుండి వైదొలగడం అనేది చట్టం నుండి రావాలి కానీ కథనం నుండి కాదు. అందువల్ల కేజ్రీవాల్, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లు తిరస్కరిస్తున్నాము అని జస్టిస్ శర్మ చెప్పారు. కేసు విచారణ నుండి న్యాయమూర్తులు తప్పుకోవడం వల్ల వారు ఒక నిర్దిష్ట రాజకీయ పార్టీకి లేదా సిద్ధాంతానికి అనుకూలంగా ఉన్నారని ప్రజలు భావించే అవకాశం ఉంది. ఈ న్యాయస్థానం, న్యాయమూర్తులు తమ కేసు విచారణ నుండి తప్పుకొంటున్నట్టు ఉత్తర్వులు జారీ చేయడం ద్వారా దీన్ని అనుమతించరు అని జడ్జి పేర్కొన్నారు.