న్యూఢిల్లీ: గుజరాత్‌కు చెందిన బిల్కిస్ బానో కేసులో ఇద్దరు దోషులు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు శుక్రవారం డిస్మిస్ చేసింది. ఈ ఇద్దరి శిక్షా కాలాన్ని తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు జనవరి 8న రద్దు చేసింది. ఈ తీర్పుపై దోషులు అప్పీల్ చేశారు. సుప్రీంకోర్టు ధర్మాసనం స్పందిస్తూ, ఇదే కోర్టులోని సమాన స్థాయిగల వేరొక ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై అప్పీల్‌ను ఏ విధంగా విచారించగలమని ప్రశ్నించింది. 2002 ఫిబ్రవరిలో గుజరాత్‌లోని గోద్రాలో రైలు బోగీ దహనం జరిగింది. అనంతరం జరిగిన అల్లర్లలో బిల్కిస్ బానోపై అత్యాచారం జరిగింది. ఈ కేసులో 11 మంది దోషులు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. వీరికి గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం 2022లో శిక్షను తగ్గించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను సుప్రీంకోర్టు రద్దు చేసి, తిరిగి 11 మంది దోషులను జైలుకు పంపింది. వీరిలో ఇద్దరు ఈ అప్పీల్‌ను దాఖలు చేశారు.