Supreme Court | తిరుమల లడ్డూ ప్రసాదం వ్యవహారంలో సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. గత వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి ఉపయోగించారని.. ఇందులో జంతువుల కొవ్వులతో చేసిన నెయ్యిని వాడినట్లు ప్రభుత్వం ల్యాబ్ నివేదికలు బయటపెట్టింది. ఈ వ్యవహారంలో భక్తులతో పాటు పలు ధార్మిక సంస్థలతో పాటు ఆధ్యాత్మికవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ఆరోపణలపై విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేయాలని కోరుతూ హిందుసేన అధ్యక్షుడు సుర్జిత్ సింగ్ యాదవ్ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు.
లడ్డూ వ్యవహారంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. లడ్డూ ప్రసాదం తయారీలో జంతు కొవ్వు కలిసిన నెయ్యిని ఉపయోగించి హిందువుల మనోభావాలను అగౌరవపరిచారని, హిందూ సమాజాన్ని ఇది తీవ్రంగా కలవరపెడుతోందన్నారు. ప్రజల ప్రయోజనం కోసమే తాను ఈ పిటిషన్‌ను దాఖలు చేశానన్నారు. సాధారణ పౌరులు అందరూ కోర్టు తలుపు తట్టలేకపోవచ్చని, సరిగ్గా సన్నద్ధం కాకపోవడం, ఆర్థిక పరిస్థితి అనువుగా లేకపోవడం ఇందుకు కారణాలుగా ఉండవచ్చన్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల లడ్డూ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు సత్యసింగ్ అనే న్యాయవాది లేఖ రాసిన విషయం తెలిసిందే.
గత టీటీడీ బోర్డు హయాంలో ప్రసాదంలో మాంసాహార ఉత్పత్తులను ఉపయోగించినట్లు వెలుగు చూసిందని.. ఈ చర్య హిందూ మతపరమైన ఆచారాలు, ప్రాథమిక సిద్ధాంతాలను ఉల్లంఘించడంతో పాటు మత విశ్వాసాలపై దాడి చేసినట్లేనన్నారు. ప్రసాదంలో ఈ తరహాలో పదార్థాలు ఉపయోగించడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 25(1) ప్రకారం రాజ్యాంగ పరిరక్షణపై దాడికి పాల్పడడమేనని.. ఆర్టికల్ 25(1) ప్రకారం అందరికీ మత స్వేచ్ఛ ఉంటుందని లేఖలో పేర్కొన్నారు. పవిత్ర నైవేద్యాన్ని మాంసాహారంతో కలుషితం చేయడం భక్తుల హక్కులను ఆలయ నిర్వాహకులు కాలరాయడమేనన్నారు. ప్రభుత్వం నియమించిన అధికారుల పర్యవేక్షణలోనే తిరుమలలో ఉల్లంఘన జరిగిందనే వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.