న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: కేంద్ర ప్రభుత్వం విపక్షాలపై రాజకీయ ప్రతీకారంతో దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నదని ఆరోపిస్తూ ప్రతిపక్ష పార్టీలు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు విముఖత వ్యక్తం చేసింది. వాస్తవాలు లేకుండా సాధారణ మార్గదర్శకాలు జారీచేయలేమని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం తెలిపింది. దర్యాప్తు సంస్థల దుర్వినియోగానికి సంబంధించి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కేసుల వివరాల ప్రస్తావనతో మళ్లీ రావాలని సూచించింది. దీంతో పిటిషన్ ఉపసంహరణకు పిటిషన్‌దారుల తరపు న్యాయవాది ఏఏం సింఘ్వీ అనుమతి కోరారు. అందుకు కోర్టు అనుమతించింది. కాగా, విచారణ సందర్భంగా కేంద్రం ప్రతిపక్షాలపై దర్యాప్తు సంస్థలను ఏవిధంగా దుర్వినియోగం చేస్తున్నదో న్యాయవాది సింఘ్వీ గణాంకాలతో వివరించారు. 2014, 2022 మధ్య సీబీఐ, ఈడీ కేసులు ఆరు రెట్లు పెరిగాయని వివరించారు. 121 మంది రాజకీయ నాయకులను ఈడీ విచారిస్తే.. వారిలో 95 శాతం మంది ప్రతిపక్ష నేతలేనని పేర్కొన్నారు.