ముంబై: మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవిస్ శివసేనపై మరోసారి మండిపడ్డారు. మసీదుల నుండి లౌడ్ స్పీకర్లను తొలగించడానికి భయపడే వారు, బాబ్రీ మసీదును కూల్చినట్లు చెబుతున్నారని విమర్శించారు. ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో శివసేనపై ఆరోపణలు చేశారు. బాబ్రీ మసీదు కూల్చివేతలో తాను కూడా భాగమే అని తెలిపారు. అయితే అప్పుడు శివసేన నాయకుడు ఎవరూ కూడా అక్కడ లేరని ఎద్దేవా చేశారు. బాబ్రీని తాను మసీదుగా పరిగణించనని, అది కేవలం ఒక నిర్మాణమని ఆయన వ్యాఖ్యానించారు.
మరోవైపు మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంపైనా దేవేంద్ర ఫడ్నవిస్ విమర్శలు చేశారు. శివసేన ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుందన్నది పెద్ద ప్రశ్నగా మారిందన్నారు. ఇద్దరు మంత్రులు జైలులో ఉన్నారని, అయితే ప్రభుత్వ నిర్ణయాలపై జైలులో ఉన్న మంత్రి ఫొటోను సిగ్గు లేకుండా ముద్రించారని మండిపడ్డారు. ఇంతకు ముందు ఇంటి నుంచి పనులు చక్కబెట్టేవారని, ఇప్పుటు ఏకంగా జైలు నుంచే ఆ పని చేస్తున్నారని దుయ్యబట్టారు.