ముంబై, జూన్ 18: ముంబైలో అత్యంత దయనీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోలు ప్రజల జీవనం ఎంత దయనీయంగా ఉందో చూపెడుతున్నాయి. వెర్సోవా బీచ్లో రాత్రిపూట వందలాది మంది కుటుంబాలు సహా పడుకుంటున్న దృశ్యాలు చర్చనీయాంశంగా మారాయి. వెర్సోవా తీర ప్రాంతంలోని మురికి వాడల్లో ఉంటున్న కుటుంబాలను కరెంట్ కోతలు వెంటాడుతున్నాయి. అనధికారిక ప్రాంతంలో ఉంటున్నారనే నెపంతో వందలాది ఇండ్లకు మహారాష్ట్ర ప్రభుత్వం కరెంట్ కోతలు విధిస్తున్నది.
దీంతో రాత్రిపూట కరెంట్ లేక, ఇరుకైన ఇండ్లలో వేడిని తట్టుకోలేక ప్రజలు బీచ్లలో పడుకుంటున్నారు. వాళ్ల ఇండ్లు రేకులతో నిర్మించినవి కావడంతో రాత్రి పూట వేడి మరింత ఎక్కువగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. రాత్రిపూట కరెంట్ కోతల వల్ల వేడి తట్టుకోలేక ఇలా పడుకుంటున్నామని చెబుతున్నారు. కొన్ని రోజుల క్రితం మీరా-భయందార్ బీచ్లో కూడా ఇలాంటి దృశ్యాలే కనిపించాయి. వందలాది మంది వలస కార్మికులు భయందార్ బీచ్లో రాత్రిళ్లు పడుకున్న వీడియోలు వైరల్ అయిన కొద్ది రోజులకే వెర్సోవా బీచ్లో కూడా ఇలాగే జరుగుతున్నది. ఈ వీడియోలు ప్రజల ఆర్థిక స్థితిగతులు, ప్రభుత్వాల వైఫల్యాలు, మౌలిక సదుపాయాలకు అద్దం పడుతున్నాయి.