న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా వైరస్ బారిన పడతామా? ఇది చాలా మంది మదిలో మెదిలే సందేహమే. పైగా ఇప్పటికే వ్యాక్సిన్లు తీసుకున్న వాళ్లు కరోనా బారిన పడుతున్న వార్తలు కూడా అక్కడక్కడా వస్తున్నాయి. దీంతో ఈ కీలకమైన అంశంపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) తన ట్విటర్ ద్వారా ప్రజల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేసింది.
పీఐబీ ప్రకారం.. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా కొవిడ్ బారిన పడే అవకాశం ఉంటుంది. అయితే చాలా తక్కువ సంఖ్యలో మాత్రం ఈ కేసులు నమోదవుతున్నాయి. పైగా వాళ్లు కూడా కరోనా కారణంగా తీవ్రమైన అనారోగ్యానికి గురి కావడం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లకు కరోనా సోకినా స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని చెప్పింది.
కొవిడ్‌ను అరికట్టడానికి వ్యాక్సినేషన్ చాలా కీలకం. కేవలం 0.03 శాతం నుంచి 0.04 శాతం మందే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కొవిడ్ బారిన పడుతున్నారు.
అది కూడా స్వల్ప లక్షణాలతో మాత్రమే. వ్యాక్సిన్ వైరస్ తీవ్రతను తగ్గించి, తీవ్ర అనారోగ్యం బారిన పడకుండా చేస్తుంది. అయితే ఆ సమయంలో ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ చేయించుకున్నా పాజిటివ్ అని చూపిస్తుంది. వాళ్ల వల్ల ఇతరులకు సోకే ప్రమాదం ఉంటుంది కాబట్టి.. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా కొవిడ్ జాగ్రత్తలు పాటించాలి అని పీఐబీ స్పష్టం చేసింది.
డబ్ల్యూహెచ్‌వో ఏం చెబుతోంది?
వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కరోనా వస్తుందా? దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కూడా స్పందించింది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కొవిడ్‌తో పోరాడే యాంటీ బాడీలు సాధించడానికి శరీరానికి కొన్ని వారాల సమయం పడుతుందని, ఆలోపు వైరస్ బారిన పడే అవకాశం ఉంటుందని డబ్ల్యూహెచ్‌వో కూడా స్పష్టం చేసింది. అయితే కొవిడ్ తీవ్రత ఎక్కువగా ఉండదని తెలిపింది.
Can you get #COVID19 even after vaccination?
— PIB India (@PIB_India) May 8, 2021
Vaccine will not allow the virus to further replicate and it will not allow the disease to become more severe.#IndiaFightsCorona pic.twitter.com/xSuwabIu0j