Penugonda Lakshminarayana | న్యూఢిల్లీ, డిసెంబర్ 18: ప్రముఖ రచయిత పెనుగొండ లక్ష్మీనారాయణను సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. తెలుగులో రాసిన దీపిక అభ్యుదయ వ్యాస సంపుటికిగానూ ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు సాహిత్య అకాడమీ బుధవారం ప్రకటించింది. హిందీ కవయిత్రి గగన్ గిల్, ఆంగ్ల రచయిత్రి ఈస్టరిన్ కైర్లతోసహా 21 మందికి వార్షిక సాహిత్య అకాడమీ అవార్డులు లభించాయి.
21 భాషలలో వచ్చిన నవలలు, చిన్న కథలు, కవిత్వాలు, వ్యాసాలు, నాటకాలతోసహా వివిధ సాహితీ రూపాలను పరిశీలించిన జ్యూరీ సభ్యులు విజేతలను ఎంపిక చేశారు. సాహితీ విమర్శనాత్మక రచనలకుగాను పెనుగొండ లక్ష్మీనారాయణతోపాటు కన్నడ నుంచి కేవీ నారాయణ, మరాఠీ నుంచి సుధీర్ రసల్ అవార్డులకు ఎంపికయ్యారు. అవార్డు గ్రహీతలకు జ్ఞాపిక, శాలువాతోపాటు రూ.లక్ష నగదు బహుమతి ఉంటుంది.