శనివారం 05 డిసెంబర్ 2020
National - Oct 04, 2020 , 19:26:19

రేపు జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశం

రేపు జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశం

న్యూఢిల్లీ : జీఎస్‌టీ 42వ కౌన్సిల్‌ సమావేశం సోవారం జరుగనుంది. జీఎస్‌టీ పరిహారం విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై పలు రాష్ట్రాలు ఇప్పటికే తమ నిరసనను వ్యక్తం చేస్తున్నాయి. సమావేశంలో బీజేపీయేతర రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉంది. జీఎస్‌టీ రెవెన్యూ నష్టాన్ని అప్పుల ద్వారా భర్తీ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు తెలిపిన సంగతి తెలిసిందే. బీజేపీ సహా మద్దతిస్తున్న 21 రాష్ట్రాలు కేంద్రం చెప్పినట్లు అప్పు తీసుకునేందుకు అంగీకరించాయి. పశ్చిమ బెంగాల్, పంజాబ్, కేరళ రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లుగా అప్పు తీసుకునేందుకు అంగీకరించడం లేదు. ఈ క్రమంలో సోమవారం జరిగే కౌన్సిల్‌ భేటీలో పలు రాష్ట్రాలు బకాయిలపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లోటును భర్తీ చేసేందుకు ప్రత్యామ్నాయ విధానాన్ని రూపొందించాలని కోరనున్నట్లు సమాచారం.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వాలకు జీఎస్‌టీ రెవెన్యూ రూ.2.35 లక్షల కోట్ల మేరకు తగ్గింది. దీంట్లో రూ.97వేల కోట్లు మాత్రమే జీఎస్‌టీ అమలు వల్ల తగ్గిందని, మిగతా 1.38లక్షల కోట్లు కరోనా మహమ్మారి ప్రభావం వల్ల తగ్గిందని కేంద్రం చెబుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని భర్తీ చేసుకునేందుకు రెండు అవకాశాలను ఆగస్టులో ప్రకటించింది. వీటిలో ఒకటి, భారతీయ రిజర్వు బ్యాంకు ఏర్పాటు చేసిన స్పెషల్ విండో ద్వారా రూ.97వేల కోట్లు వరకు రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు తెచ్చుకోవచ్చు. మరొకటి, మార్కెట్ నుంచి రూ.2.35 లక్షల కోట్ల వరకు అప్పు తీసుకోవచ్చు. ఈ ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రాలకు కేంద్రం పరిహారం జూలై వరకు 1.5లక్షల కోట్లు పెండింగ్‌లో ఉంది. ఇందులో అత్యధికంగా మహారాష్ట్రకు రూ.22,458, కర్ణాటకకు రూ.13,763 కోట్లు, యూపీకి రూ.11,742 కోట్లు, గుజరాత్‌కు రూ.11,536 కోట్లు, తమిళనాడుకు రూ.11.269 కోట్లు చెల్లించాల్సి ఉంది. 

కేంద్రమంత్రికి బిహార్‌ ఉప ముఖ్యమంత్రి లేఖ

బిహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. ‘జీఎస్‌టీ విషయంలో కేంద్రం వేగంగా పని చేయాలని, రాష్ట్రాలు రుణాలు తీసుకునేలా చూడాలన్నారు. జీఎస్టీ ఆదాయం తగ్గడం, పరిహారం ఆలస్యం కావడంతో అన్ని రాష్ట్రాలకు అత్యవసరంగా నిధులు అవసరం ఉందనే వాస్తవాన్ని నేను మీకు చెప్పాలిన అవసరం లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో ప్రవేశించబోతున్నాం. ప్రస్తుత సంవత్సరానికి ప్లాన్‌ చేసిన కార్యకలాపాల కోసం ఎంతో చేయాల్సి ఉంది. తగినన్ని నిధులు లేక అన్ని నిలిపివేబడ్డాయి.  నిధుల లభ్యత, అదే అప్పుల రూపంలో ఉన్నప్పటికీ, కొనసాగుతున్న మహమ్మారి నేపథ్యంలో అభివృద్ధి ప్రక్రియను మళ్లీ ప్రారంభించడానికి రుణాలు వీలు కల్పిస్తాయని’ లేఖలో పేర్కొన్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.