రాంచి: జార్ఖండ్‌లోని గిరీధ్ జిల్లాలో స్థానిక గిరిజనులు, జైనుల మధ్య గత బీజేపీ ప్రభుత్వం పెట్టిన చిచ్చు అగ్నిజ్వాలగా మారుతున్నది. ఇక్కడ పర్వతశ్రేణులను గిరిజనులు తమ ఇష్టదైవం మారంగ్బురు కొండలని, జైనులు పారస్నాథ్ పర్వతాలని పిలుచుకుంటారు. కొన్ని వేల సంవత్సరాల నుంచి గిరిజనులు ఈ కొండలను తమ దేవతలుగా కొలుచుకుంటున్నారు. రెండువేల సంవత్సరాలకు పూర్వం ఇక్కడి కొండలపై ఆలయాలు నిర్మించిన జైనులు వాటిని పుణ్యక్షేత్రాలుగా మార్చివేశారు. ఇంతకాలం అటు గిరిజనులు, ఇటు జైనులు ఎటువంటి వివాదం లేకుండా సామరస్యంగా ఎవరికి వారు తమ పూజలు చేసుకుంటున్నారు. నాలుగేండ్ల క్రితం రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈ పర్వత శ్రేణులను జైనుల పర్యాటక కేంద్రంగా ప్రకటించడంతో వివాదం రగులుకున్నది. వేల సంవత్సరాల నుంచి తాము మారంగ్బురు కొండలను పూజిస్తున్నామని, వాటిని జైనుల పుణ్యక్షేత్రం (పారస్నాథ్)గా ప్రకటించడం అన్యాయమని గిరిజనులు మండిపడుతున్నారు. జైన మందిరం వద్ద కోడి ఎముకలు, మాంసం, మద్యం కనిపించాయంటూ కొండల దిశగా గిరిజనుల రాకపోకలపై ఆంక్షలు విధించడం వారిని ఆగ్రహానికి గురిచేసింది. జంతు బలులు ఇవ్వటం గిరిజనుల సంస్కృతి. కాగా వారు అధికంగా నివాసముండే ప్రాంతంలోనే పారస్నాథ్ మందిరం ఉండటం గమనార్హం. జైనులు తమ భూములను ఆక్రమించడమే కాకుండా తమ ఆచార వ్యవహారాలు, పద్ధతులపై ఆధిపత్యం చెలాయిస్తున్నారని గిరిజనులు ఆరోపిస్తున్నారు. ఇటీవల వారు తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేశారు. బోరియో ఎమ్మెల్యే లాబిన్ హెంబ్రోం నేతృత్వంలో ఆదివాసీ సంఘాలు కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నాయి. జార్ఖండ్, బెంగాల్, ఒడిశా నుంచి వచ్చిన వేలాది గిరిజనులు కొండలపైకి ఎక్కి జైనులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు.
గిరిజనుల హక్కులు కాపాడేందుకు యత్నం
జైనులు తమ ప్రార్థన మందిరాలు ఉన్న కొండకు పది కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇతరులు ఎవరినీ అనుమతించడం లేదు. ఇక్కడే గిరిజనుల పవిత్ర స్థలాలు కూడా ఉన్నాయని ఎమ్మెల్యే లాబిన్ హెంబ్రోం చెప్పారు. వివాద పరిష్కారరంలో ప్రభుత్వ జోక్యాన్ని జైనులు అనుమతించడం లేదని ఆయన ఆరోపించారు. హేమంత్ సొరేన్ నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం గిరిజనుల హక్కులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నదని తెలిపారు.