శ్రీనగర్: జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్, ప్రస్తుత మేఘాలయ గవర్నర్ సత్య పాల్ మాలిక్‌కు పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) శుక్రవారం లీగల్ నోటీసులు ఇచ్చింది. పార్టీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ పరువునకు నష్టం కలిగించేలా ప్రకటనలు చేసిన ఆయనపై రూ.10 కోట్ల దావా వేసింది. ఇటీవల మీడియాతో మాట్లాడిన గవర్నర్ సత్య పాల్ మాలిక్, జమ్ముకశ్మీర్ హైకోర్టు ఆదేశాల మేరకు గత సంవత్సరం రద్దు చేసిన రోష్ని చట్టం 2001 కింద ప్రభుత్వ భూమి లబ్ధిదారుగా ముఫ్తీ ఉన్నారని ఆరోపించారు.
జమ్ముకశ్మీర్ స్టేట్ ల్యాండ్ (ఆక్రమణదారులకు యాజమాన్య హక్కుల వెస్టింగ్) చట్టం 2001 అయిన రోష్నీని నాటి ఫరూక్ అబ్దుల్లా ప్రభుత్వం ప్రవేశపెట్టిందని మాలిక్ తెలిపారు. అనధికార నిర్వాసితులకు యాజమాన్య హక్కులు కల్పించడం ద్వారా సమకూరే నిధులను రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిని మెరుగుపరచడానికి ఉపయోగిస్తామని నాడు ఆయన చెప్పారన్నారు.
అయితే విద్యుత్ పరిస్థితి మెరుగుపడలేదు కానీ, ఫరూక్ అబ్దుల్లా, ఆయన కుమారుడు, మెహబూబాకు ప్లాట్లు ఇచ్చారని మాలిక్ విమర్శించారు. రాష్ట్ర గవర్నర్‌గా ఉన్న తాను ఆ కేటాయింపులను చేసి దర్యాప్తునకు ఆదేశించినట్లు చెప్పారు.
గవర్నర్ మాలిక్ చేసిన ఈ వ్యాఖ్యలను మెహబూబా ముఫ్తీ ఖండించారు. ఆయన చేసిన ఈ తప్పుడు, అసహ్యకరమైన ప్రకటనలు చాలా దుర్మార్గమైనవని విమర్శించారు. ఈ వ్యాఖ్యలను ఆయన ఉపసంహరించుకోవాలి లేదా దావా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆమె హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో గవర్నర్ మాలిక్‌కు పీడీపీ శుక్రవారం లీగన్ నోటీసు పంపింది. ముఫ్తీ రాజకీయ ప్రతిష్ఠను దిగజార్చాలన్న ఏకైక లక్ష్యంతో మాలిక్ ఈ వ్యాఖ్యలు చేశారని ఆరోపించింది. పరువు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేసిన గవర్నర్ మాలిక్, ఈ లీగల్ నోటీసు అందిన 30 రోజుల్లోపు రూ.10 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేసింది. ఆ మొత్తాన్ని విరాళంగా లేదా ప్రజా ప్రయోజనాల కోసం వినియోగిస్తామని ఆ నోటీసులో పేర్కొంది.
False & unsavoury utterances of Satya Pal Malik about me being a beneficiary of Roshni Act is highly mischievous.
— Mehbooba Mufti (@MehboobaMufti) October 20, 2021
My legal team is preparing to sue him.
He has the option to withdraw his comments failing which I will pursue legal recourse. pic.twitter.com/QVSOEFLGYp