లక్నో: కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) పరీక్షలకు సంబంధించిన స్కామ్ బయటపడింది. ఎస్ఎస్సీ ఎగ్జామ్ పాస్ కోసం ఒక్కో అభ్యర్థి నుంచి రూ.4 లక్షలను ఒక ముఠా వసూలు చేస్తున్నది. అధునాతన సాంకేతికతో ఆన్లైన్ పరీక్షలో మోసాలకు పాల్పడుతున్నది. (Pay Rs 4 lakh, pass SSC) ఉత్తర ప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) ఈ గుట్టును ఛేదించింది. గ్రేటర్ నోయిడాలోని నాలెడ్జ్ పార్క్ ప్రాంతంలో ఉన్న ‘బాలాజీ డిజిటల్ జోన్’ పరీక్షా కేంద్రంలో ఎస్ఎస్సీకి సంబంధించిన పలు ఆన్లైన్ పరీక్షలు నిర్వహించారు.
కాగా, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (సీఏపీఎఫ్), సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (ఎస్ఎస్ఎఫ్) కానిస్టేబుల్ జీడీ, అస్సాం రైఫిల్స్ రైఫిల్‌మ్యాన్ ఎగ్జామినేషన్-2026 నియామకాల కోసం నిర్వహించిన ఆన్లైన్ పరీక్షలలో ఈ ఎగ్జామ్ సెంటర్‌కు చెందిన ఒక ముఠా అవకతవకలకు పాల్పడినట్లు యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది.
దీంతో మే 22న పోలీసులు రైడ్ చేశారు. ఏడుగురు నిందితులైన ప్రదీప్ చౌహాన్, అరుణ్ కుమార్, సందీప్ భాటి, నిశాంత్ రాఘవ్, అమిత్ రాణా, షకీర్ మాలిక్, వివేక్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. రూ. 50 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, ఎస్ఎస్సీ పరీక్షలకు సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు ఎస్ఎస్సీ ఆన్లైన్ పరీక్షల్లో వ్యవస్థీకృత మోసాలకు నిందితులు పాల్పడుతున్నారని దర్యాప్తు అధికారి తెలిపారు. అయితే ఎస్ఎస్సీ పరీక్షా వ్యవస్థను నిందితులు నేరుగా హ్యాక్ చేయలేదని చెప్పారు. పరీక్షా కేంద్రంలోని కంపెనీ సర్వర్‌ను బైపాస్ చేసి ఒక ప్రాక్సీ సర్వర్‌ను ఏర్పాటు చేశారని ఆరోపించారు.
కాగా, స్క్రీన్-షేరింగ్ వ్యూయర్ అప్లికేషన్ ద్వారా పరీక్షా కేంద్రం బయట ఉన్న సాల్వర్లకు ప్రశ్నపత్రాలను పంపుతున్నారని పోలీస్ అధికారి తెలిపారు. ఆ తర్వాత సాల్వర్లు రిమోట్‌గా ప్రశ్నలను పరిష్కరిస్తున్నారని, పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు సరైన సమాధానాలు పంపుతున్నారని వివరించారు.
ఈ ముఠాలోని ప్రధాన నిందితుడు ప్రదీప్ చౌహాన్ చాలా కాలంగా ఈ రాకెట్ నడుపుతున్నాడని పోలీస్ అధికారి తెలిపారు. ఎడ్యూక్విటీ అనే కంపెనీ ద్వారా ఎస్ఎస్సీ ఆన్లైన్ పరీక్షలు నిర్వహించే పరీక్షా కేంద్రాన్ని అతడు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రాక్సీ సర్వర్ సిస్టమ్ ఇన్స్టాలేషన్, నిర్వహణతో సహా సాంకేతిక కార్యకలాపాలను అరుణ్ కుమార్ చూసున్నట్లు వివరించారు.
ఇలా మోసపూరితంగా ఎస్ఎస్సీ ఆన్లైన్ ఎగ్జామ్ పాస్ చేయించేందుకు ఒక్కో అభ్యర్థి నుంచి రూ.4 లక్షలను ఈ ముఠా వసూలు చేస్తున్నట్లు తెలిసిందని పోలీస్ అధికారి తెలిపారు. దీనిపై మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఇతర నియామక పరీక్షలలో కూడా ఇలాంటి అక్రమాలకు పాల్పడ్డారా? అన్నది కూడా పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.