న్యూఢిల్లీ, జూలై 15: ‘మాకు ఇథనాల్ కలిపిన పెట్రోల్ వద్దు.. స్వచ్ఛమైన పెట్రోలే కావాలని కోరుకుంటున్నారా? అయితే దానికి మీరు అధిక ధర చెల్లించాల్సి ఉంటుంది’ అని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. కేంద్రం అమలు చేస్తున్న ఈ20 ఇథనాల్ పాలసీపై దేశ వ్యాప్తంగా విమర్శలు వస్తున్నా.. ఆయన దానిని గట్టిగా సమర్థించారు. ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఈ20తో వాహనాల ఇంజిన్లు పాడవుతున్నాయన్న ఆరోపణలను తిరస్కరించారు. అది పూర్తిగా తప్పుడు సమాచారమని, ఇథనాల్ ఇంధనంతో తమ వాహన ఇంజిన్ పాడైనట్టు తమకు ఇంతవరకు ఒక్క ఫిర్యాదు కూడా అందలేదని తెలిపారు. ‘ఇథనాల్ ఇంధనాన్ని ఇష్టపడని వాహనదారులు 100 శాతం పెట్రోల్‌కు వెళ్లవచ్చు. అయితే వారు దానికి అధిక ధరను చెల్లించాల్సి ఉంటుంది’ అని ఆయన తెలిపారు.
దేశంలో త్వరలో ఎగిరే బస్సులను ప్రవేశ పెట్టనున్నట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ వేగంగా పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని పరిష్కరించే లక్ష్యంతో ఎగిరే బస్సులను ప్రవేశపెట్టే ప్రణాళికలను ప్రకటించారు.‘త్వరలో ఎగిరే బస్సులను ప్రవేశ పెట్టనున్నాను. ప్రజలు ఒక మూల నుంచి మరో మూలకు ఎంతో వేగంగా ప్రయాణం చేస్తారు’ అని గడ్కరీ పేర్కొన్నారు.