DMK | త్రిభాషా విధానం అమలు విషయంలో కేంద్రం, తమిళనాడు ప్రభుత్వం మధ్య గత కొన్ని రోజులుగా వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ వివాదంపై ప్రముఖ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చకు దారితీస్తున్నారు. త్రిభాషా సూత్రంపై డీఎంకే తీరును పవన్ ఆక్షేపించారు. దక్షిణాదిపై హిందీని రుద్దుతున్నారంటూ మాట్లాడుతున్నప్పుడు.. తమిళ సినిమాల్ని హిందీలో డబ్బింగ్ ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నించారు. పవన్ వ్యాఖ్యలపై తమిళనాడు డీఎంకే ప్రభుత్వం తాజాగా స్పందించింది.
ఈ మేరకు డీఎంకే అధికార ప్రతినిధి డాక్టర్ సయ్యద్ హఫీజుల్లా వివరణ ఇచ్చారు. భాషా విధానంపై తమిళనాడు వైఖరిని పవన్ తప్పుగా అర్థం చేసుకున్నారని వ్యాఖ్యానించారు. వ్యక్తిగతంగా హిందీ లేదా మరే ఇతర భాషలు నేర్చుకోవడాన్ని తాము అడ్డుకోవడం లేదన్నారు. ప్రజలపై హిందీ లేదా మరే ఇతర భాషను బలవంతంగా రుద్దడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. తమిళనాడు సుదీర్ఘ కాలంగా హిందీకి బలవంతపు ప్రాధాన్యత ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తోందని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎన్ఈపీ, పీఎం శ్రీస్కూల్స్ వంటి విధానాలతో రాష్ట్ర ప్రజలపై బలవంతంగా హిందీ భాషను రుద్దుతోందన్నారు.
ఇక పవన్ వ్యాఖ్యలపై డీఎంకే సీనియర్ నేత టీకేఎస్ ఎళన్‌గోవన్ మాట్లాడుతూ.. ‘తమిళనాడు భాషా విధానం చాలా కాలంగా స్థిరంగా ఉంది. 1938 నుంచే తమిళనాడు హిందీకి వ్యతిరేకంగా పోరాడుతోంది. ద్విభాషా విధానాన్నే అమలు చేస్తామని 1968లో రాష్ట్ర అసెంబ్లీలో చట్టాన్ని కూడా ఆమోదించుకున్నాం. విద్యా నిపుణుల సలహాలు, సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆ బిల్లు పాస్ అయినప్పటికీ పవన్ కల్యాణ్ పుట్టి ఉండరు. తమిళ రాజకీయాలపై ఆయనకు అవగాహన లేకపోయి ఉండొచ్చు’ అని విమర్శించారు.
పిఠాపురంలో శుక్రవారం నిర్వహించిన సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ పలు విషయాల గురించి మాట్లాడారు. ఈ క్రమంలోనే తమిళనాట హిందీని తమపై రుద్దుతున్నారని హడావిడి చేస్తున్న కొందరి గురించి కామెంట్స్ చేశారు. అంటే పరోక్షంగా తమిళనాడు అంశాన్ని ప్రస్తావించారు. అన్ని దేశ భాషలే కదా. తమిళనాడులో హిందీ వద్దని అనడం ఎంత వరకు కరెక్ట్. మరి తమిళ సినిమాలను హిందీలోకి అనువదించకండి.. హిందీవాళ్ల డబ్బులు కావాలి.. కానీ హిందీ భాష వద్దంటే ఎలా? మనం భాషలను ద్వేషించాల్సిన అవసరం లేదు. దేశానికి తమిళం సహా బహుళ భాషలు కావాలి.. బహుభాషలే దేశానికి మంచిది అంటూ పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు.
అంతేకాదు తమిళనాడులో సంస్కృతాన్ని తిడుతున్నారు. దక్షిణాదిపై హిందీని రుద్దుతున్నారంటూ మాట్లాడుతున్నారు. ఏ రాష్ట్రంలో అయిన ముస్లింలు అరబిక్‌లోనే ప్రార్థిస్తారు. కానీ ఎన్నడూ ఆ భాష తమకొద్దని అనలేదు. హిందువులు మాత్రం దేవాలయాలలో సంస్కృత మంత్రాలు చదవొద్దని చెబుతుంటారు. ముస్లింలని చూసి హిందువులు చాలా నేర్చుకోవాలి. రూపాయి సింబల్ మార్చేసి తమిళ భాషలో పెట్టుకోవటం ఏంటి? వివేకం, ఆలోచన ఉండొద్దా అన్నారు పవన్ కళ్యాణ్. ఉత్తరాది వాళ్లు తెల్లగా ఉంటారు. మేం దక్షిణాది వాళ్లం నల్లగా ఉంటామనే మాటలతో దేశాన్ని విచ్ఛిన్నం చేయకండి. దక్షిణాదికి చెందిన సెంగోల్.. ఉత్తరాదిన ఉన్న పార్లమెంట్లో ఉంది. దీని అర్థం వైరుధ్యమొస్తే విడిపోవాలని కాదు. కలిసి పరిష్కారం వెతుక్కోవాలని. విధ్వంసం చాలా తేలిక. నిర్మించటమే కష్టం అని పవన్ అన్నారు.
Also Read..
Viral Video | స్కూల్‌కు ఎస్యూవీ కారును వేసుకెళ్లిన బాలుడు.. వీడియో వైరల్
CEC Kumar: ఓటరు-ఆధార్ కార్డు సీడింగ్‌పై సీఈసీ చర్చలు