Bihar Reservations | ఎన్డీయే కూటమి నేతృత్వంలోని బిహార్ సర్కారుకు పట్నా హైకోర్టు షాక్ ఇచ్చింది. విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను 65శాతానికి పెంచుతూ నితీశ్ కుమార్ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు గురువారం కొట్టివేసింది. రిజర్వేషన్ల పెంపు రాజ్యాంగ విరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఆయా రిజర్వేషన్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. వాస్తవానికి బిహార్‌లో రిజర్వేషన్లు 75శాతానికి చేరాయి. గత ఏడాది నంబర్లో బిహార్ సర్కారు కుల గణన నివేదికను అసెంబ్లీ ప్రవేశపెట్టింది. నివేదికలో గణాంకాల ప్రకారం.. విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు పెంచుతూ నితీశ్ కుమార్ ప్రభుత్వం సవరణ బిల్లును తీసుకువచ్చింది.
ఈ బిల్లును శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆ తర్వాత గెజిట్ సైతం విడుదలైంది. దీంతో రాష్ట్రంలో ఎస్సీలు, ఎస్టీలు, ఇతర వెనకబడిన వర్గాలు, అణగారిన వర్గాల రిజర్వేషన్లు 50 శాతం నుంచి 65 శాతానికి చేరాయి. ఆర్థికంగా వెనకబడినవారికి మరో 10శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. రిజర్వేషన్లు మొత్తం కలిపి 75శాతానికి పెరిగాయి. ఎస్సీల రిజర్వేషన్ 16 నుంచి 20 శాతానికి, ఎస్టీల రిజర్వేషన్ రెండు శాతానికి, ఓబీసీ, ఈ-బీసీల రిజర్వేషన్లు 30శాతం నుంచి 43శాతానికి చేరాయి. రిజర్వేషన్ల పెంపుపై గౌరవ్కుమార్తో పాటు పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తూ పట్నా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్లపై ప్రభుత్వం, పిటిషన్ల వాదనలను విన్న కోర్టు.. మార్చిలో తీర్పును రిజర్వ్ చేసింది.
తాజాగా గురువారం తుది తీర్పును వెలువరించింది. హైకోర్టు ఆదేశాలతో మళ్లీ గతంలో మాదిరిగానే 50శాతం రిజర్వేషన్లు అమలులోకి రానున్నాయి. రాజ్యాంగం నిబంధనల ప్రకారం.. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు సముచిత ప్రాతినిథ్యం కల్పించేందుకు రిజర్వేషన్లు కల్పించారని.. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించడం సరికాదని పిటిషనర్లు వాదించారు. ప్రభుత్వం ఆమోదించిన చట్టం రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందని పేర్కొన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేవీ చంద్రన్‌తో కూడిన డివిజన్ బెంచ్ సుదీర్ఘంగా పిటిషన్లపై సుదీర్ఘంగా విచారించి.. మార్చి 11న నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. కోర్టు నిర్ణయం కూటమి సర్కారుకు పెద్ద షాక్‌గా మారింది. కోర్టు తీర్పు నేపథ్యంలో నితీశ్ ఏం చేస్తారోనన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరో వైపు 65శాతం రిజర్వేషన్లను ఎన్డీయే కూటమిలోని బీజేపీ సమర్థించకపోవడం గమనార్హం.