Flight On Air | హిండన్ విమానాశ్రయం చిన్నగా ఉండడం.. విమానాల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఇబ్బందులు తప్పడం లేదు. విమానాలను పార్క్ చేసేందుకు సరైన స్థలం లేకపోవడంతో తిప్పలు కొనసాగుతున్నాయి. పట్నాకు వెళ్లాల్సిన విమానం దాదాపుగా 20 నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి ఎదురైంది. పార్కింగ్ స్థలం దొరికిన తర్వాత విమానాన్ని ల్యాండ్ చేశారు. దాంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. బుధవారం సైతం పార్కింగ్ లేకపోవడంతో పాట్నా నుంచి వచ్చే పలు విమానాలను రద్దు చేశారు.
కేంద్ర ప్రభుత్వం 2019లో అక్టోబర్‌లో ప్రభుత్వం ఉడాన్ పథకంలో భాగంగా ఎయిర్‌పోర్ట్‌ని ప్రారంభించింది. తీవ్రమైన పార్కింగ్ కొరత ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఈ విమానాశ్రయానికి ఎయిర్ ఇండియా, ఇండిగో విమానాలు నడుపుతున్నాయి. అయితే, హిండన్ సివిల్ టెర్మినల్‌లోని ఓ అధికారి మాట్లాడుతూ విమానాశ్రయం మౌలిక సదుపాయాల పరిమితుల కారణంగా ఇబ్బందులకు గురవుతోందన్నారు. కానీ, ఇది సేవల్లో కోతలకు దారి తీస్తుందా..? లేదా? అని చెప్పేందుకు నిరాకరించారు. టెర్మినల్ వైమానిక దళం సర్వీస్ నుంచి పని చేస్తున్న నేపథ్యంలో విమానాల సాయంత్రం నుంచి తెల్లవారు జామున వరకు నిషేధంతో సహా పలు ఆంక్షలు ఎదుర్కొంటున్నాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
కనీసం రెండు అదనపు బేలు నిర్మిస్తే మరింత సమర్థవంతంగా పని చేయగలుగుతామని ఆ అధికారి పేర్కొన్నారు. పౌర విమానయాన, రక్షణ మంత్రిత్వ శాఖలు, వైమానిక దళంతో పాటు సాధ్యమయ్యే విస్తరణ గురించి చర్చిస్తున్నాయని తెలిపారు. ఎయిర్పోర్ట్ విస్తరణకు తొమ్మిది ఎకరాలు అవసరమని భావిస్తున్నారు. 2019లో ప్రయాణికుల రద్దీ ఏటా 8వేలు ఉండగా.. ఇప్పుడు 80వేలకు చేరింది. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం తెరిచే వరకు ఢిల్లీ ఐజీఐ విమానాశ్రయంపై ఒత్తిడిని తగ్గించడంలో హిండన్ విమానాశ్రయం పాత్ర ఎంతో ఉంటుందని.. అయితే పార్కింగ్ కొరత కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా రద్దీ సమయాల్లో ఈ సమస్య కొనసాగుతుందని అధికారులు అంగీకరించారు. ప్రస్తుతం ముంబయి, బెంగళూరు, కోల్‌కతా, గోవా, చెన్నై, పాట్నాతో సహా 16 గమ్యస్థానాలకు హిండన్ ఎయిర్‌పోర్ట్‌ను అనుసంధానించారు.