జైపూర్: దేశంలో కొవిడ్ నాలుగో వేవ్ ముంచుకొస్తున్నదని వార్తలు వెలువడుతున్నాయి. ఇప్పటికే చైనాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఒమిక్రాన్ బీఎఫ్-7 వేరియంట్.. భారత్‌లోనూ కాలు మోపిందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గుజరాత్లో ఇద్దరిలో, ఒడిశాలో ఒకరిలో ఒమిక్రాన్ బీఎఫ్-7 రకం కరోనా వైరస్‌ను గుర్తించారు. ఇవాళ ఉదయం కూడా మరో కేసులో ఒమిక్రాన్ బీఎఫ్-7 రకం బయటిపడినట్లు తెలుస్తున్నది.
శరవేగంగా విస్తరించే ఈ కొత్త వేరియంట్‌తో దేశంలో నాలుగో వేవ్ విజృంభిస్తుందేమోనని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ వైద్యుడు రాజీవ్ బన్సల్.. ఇప్పటికే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు రాబోయే రోజుల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. క్రమం తప్పకుండా బ్లడ్ షుగర్ స్థాయిలు, బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకోవాలని చెబుతున్నారు.
కరోనా మరో వేవ్ వస్తే ఇప్పటికే షుగర్, బీపీ, థైరాయిడ్‌తోపాటు గుండె, కాలేయం, కిడ్నీలు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న వారికి చాలా ప్రమాదకరమని చెప్పారు. కరోనా సోకక ముందే తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ద్వారా వారు ప్రమాదం నుంచి బయటపడవచ్చని చెప్పారు. మాస్కులు ధరించడం, శానిటైజర్ వినియోగించడం, తినడానికి మందు హ్యాండ్ వాష్ లేదా సబ్బుతో చేతులను శుభ్రం చేసుకోవడం, సామాజిక దూరం పాటించడం ద్వారా కరోనా మహమ్మారిని దూరం పెట్టొచ్చని రాజీవ్ బన్సల్ తెలిపారు.