Patajali products : మాన్యుఫాక్చరింగ్ లైసెన్స్ రద్దయిన 14 రకాల ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేశామని పతంజలి ఆయుర్వేద (Patanjali Ayurved) సంస్థ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఆయా ఉత్పత్తులను వెనక్కి తీసుకోవాలని దేశవ్యాప్తంగా ఉన్న తమ ఫ్రాంచైజీ స్టోర్లకు సూచించినట్లు తెలిపింది. అదేవిధంగా వాటికి సంబంధించిన ప్రకటనలను ఉపసంహరించుకోవాలని మీడియా సంస్థలకు సమాచారం ఇచ్చినట్లు అఫిడవిట్లో పేర్కొంది.
వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా వాణిజ్య ప్రకటనలు ఇచ్చిన కేసులో పతంజలి ఆయుర్వేద సంస్థ సుప్రీంకోర్టు విచారణను ఎదుర్కొంటోంది. పతంజలి సంస్థ తప్పుదోవ పట్టించేలా వాణిజ్య ప్రకటనలు ఇచ్చినట్లు నిర్ధరణ కావడంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆ సంస్థపై చర్యలు తీసుకుంది. ఆ సంస్థకు చెందిన 14 రకాల ఉత్పత్తులు, అనుబంధ విభాగం దివ్య ఫార్మసీ ఉత్పత్తుల తయారీ లైసెన్సును రద్దు చేసింది.
ఈ క్రమంలోనే కేసు సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఉత్తరాఖండ్ సర్కారు వేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ఆఫిడవిట్ దాఖలు చేయాలని పతంజలి ఆయుర్వేద సంస్థను ఆదేశించింది. దాంతో ఉత్తరాఖండ్ సర్కారు తయారీ లైసెన్స్లు రద్దు చేసిన ఆ 14 రకాల ఉత్పత్తుల విక్రయాలను నిలిపేశామని తెలుపుతూ పతంజలి ఆయుర్వేదిక్ సంస్థ అఫిడవిట్ దాఖలు చేసింది.