సమస్తిపూర్, మే 3: మద్యం తాగేందుకు డ్రైవర్ ఇంజిన్ దిగి బయటకు వెళ్లండంతో ఓ ప్యాసెంజర్ ట్రైన్ గంటపాటు స్టేషన్లోనే నిలిచిపోయింది. ఈ ఘటన బీహార్లోని సమస్తిపూర్ రైల్వే డివిజన్ పరిధిలో తాజాగా చోటుచేసుకున్నది. సమస్తిపూర్ నుంచి సహర్స వెళ్లే రైలును రాజధాని ఎక్స్ప్రెస్ క్రాసింగ్ కోసం హసన్పూర్ స్టేషన్లో ఆపారు.
ఇదే సమయంలో అసిస్టెంట్ లోకో పైలట్ కరణవీర్ యాదవ్ మద్యం కోసం బయటకు వెళ్లాడు. సిగ్నల్ ఇచ్చినా రైలు కదలకపోవడంతో స్టేషన్ మాస్టర్ రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సమీపంలోని ఓ మద్యం దుకాణం వద్ద డ్రైవర్ మత్తులో కనీసం నిలబడలేని పరిస్థితిలో కనిపించాడు. దీంతో అతన్ని వెంటనే అరెస్టు చేయడంతో పాటు ఉన్నతాధికారులు మెమో జారీచేశారు. ఘటనపై డివిజనల్ రైల్వే మేనేజర్ విచారణకు ఆదేశించారు.