చెన్నై: రాగల వారం రోజుల పాటు తమిళనాడు, పుదుచ్చేరిల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్ర (IMD) చెన్నై విభాగం వెల్లడించింది. తమిళనాడు ఉత్తర తీర ప్రాంతం, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి ఆవరించి ఉన్నదని తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడా పిడుగులు కూడా పడే అవకాశం ఉన్నదని పేర్కొంది.
నీల్గిరీస్, తిరుపత్తూర్, వెల్లూర్ జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని ఐఎండీ తెలిపింది. అదేవిధంగా తిరువన్నామలై, రాణిపేట్, తిరువల్లూర్, కాంచీపురం, చెంగల్పట్టు, విల్లుపురం, క్రిష్ణగిరి, ధర్మపురి, సాలెం, కోయంబత్తూరు జిల్లాలోని ఘాట్ ఏరియాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.