న్యూఢిల్లీ, జూలై 1: దేశంలో నీట్ యూజీని వివిధ రాష్ర్టాల్లో బహుళ దశల్లో నిర్వహించాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఒకే రోజు పరీక్ష కారణంగా ఏర్పడే నిర్వహణ, రవాణా భారాన్ని తగ్గించడానికి ఈ సూచన చేసినట్టు పేర్కొన్నది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)కు చట్టబద్ధమైన హోదా కల్పించాలని ప్యానెల్ సూచించింది.
కాంగ్రెస్ ఎంపీ ముకుల్ వాస్నిక్ నేతృత్వంలో సమావేశమైన కమిటీ సభ్యులు సిఫార్సులను ప్రతిపాదించారు. ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్, ఉన్నత విద్య కార్యదర్శి వినీత్ జోషి, ఇస్రో మాజీ చైర్మన్ కే రాధాకృష్ణన్ తదితరులతో పరీక్ష నిర్వహణలోని లోపాలు, సంస్కరణలపై చర్చించి, సూచనలు స్వీకరించింది.