న్యూఢిల్లీ: రానున్న పార్లమెంట్ సమావేశాల్లో నిర్మాణాత్మకమైన చర్చలు జరిగేలా అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు బుధవారం కోరారు. సభలో ఆరోగ్యకర చర్చలు చూడాలని దేశ ప్రజలు అనుకొంటున్నారని అన్నారు.
దేశానికి సేవ చేసేందుకు పార్టీలన్నీ ‘టీమిండియా’లా ఐక్యంగా పనిచేయాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. పార్లమెంట్లో నాణ్యమైన చర్చలు జరగాలని, అర్థవంతమైన చర్చలను చూడాలని దేశం అనుకొంటున్నదని, ఈ మేరకు సభ సజావుగా జరిగేందుకు అన్ని పార్టీలు సహకరించాలని రిజిజు కోరారు. 18వ లోక్సభ మొదటి సెషన్ ఈ నెల 24న ప్రారంభం అవుతుందని, జూలై 3 వరకు సమావేశాలు కొనసాగుతాయని పేర్కొన్నారు.