న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీపై పార్లమెంట్ దద్దరిల్లింది. ఈ అంశంపై తక్షణమే చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ విపక్ష ఎంపీలు మంగళవారం తీవ్ర నిరసనలు తెలపడంతో వరుసగా రెండవరోజు లోక్‌సభ కార్యకలాపాలకు పదేపదే అంతరాయం ఏర్పడి చివరకు సభ వాయిదా పడింది. సభలో హుందాతనాన్ని పాటించి సమావేశం సజావుగా సాగేలా చూడాలని స్పీకర్ నుంచి పలుమార్లు విజ్ఞప్తులు వచ్చినప్పటికీ విపక్ష సభ్యుల నినాదాలతో సభలో గందరగోళం ఏర్పడి లోక్‌సభ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి. నీట్ యూజీ ప్రశ్నపత్రం లీక్, పాలనాపరమైన వైఫల్యాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన విపక్ష సభ్యులు ఢిల్లీలో నిరసన తెలియచేస్తున్న విద్యార్థులపై పోలీసుల చర్యను ఖండిస్తూ పరీక్ష భద్రత, సంస్కరణలపై వెంటనే పూర్తి స్థాయి చర్చ జరగాలని డిమాండ్ చేశారు. దేశంలోని యువత పట్ల వ్యవహరించే విధానం ఇది కాదు.
దేశంలోని యువతకు అవకాశాలు లేవు. అన్ని దారులు మూసుకుపోయాయి. పోటీ పరీక్షల రూపంలో ఉన్న ఏకైక మార్గం కూడా నాశనం చేశారు. ఇక్కడ ఉన్న విద్యార్థులు కేవలం విద్యా విధానం గురించే కాకుండా తమ భవిష్యత్తు గురించి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అని విపక్ష సభ్యులు తెలిపారు. అంతకుముందు అయోధ్య రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు సంబంధించిన విరాళాల చోరీ, ఆర్థిక అవకతవకలపై వచ్చిన ఆరోపణలను ప్రతిపక్ష ఎంపీలు సభలో ప్రస్తావించారు. ఈ విషయంపై పారదర్శక పార్లమెంటరీ పరిశీలన జరగాలని వారు డిమాండ్ చేశారు.
రాజ్యసభలోనూ అదే తీరు…
నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా నిరసన తెలియచేస్తున్న విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్‌పై విపక్ష ఎంపీల నిరసనల నడుమ మంగళవారం రాజ్యసభ పలుమార్లు వాయిదాపడింది. ఉదయం సమావేశాలు ప్రారంభమైన తర్వాత విపక్ష ఎంపీలు ప్రధానంగా ఇదే అంశంపై చర్చకు పట్టుపట్టారు. విపక్ష ఎంపీల నినాదాలతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. దీంతో సభను పలుమార్లు డిప్యుటీ చైర్మన్ వాయిదా వేశారు. చివరకు మధ్యాహ్నం భోజన విరామం అనంతరం సభ తిరిగి సమావేశమైన తర్వాత కూడా విపక్ష ఎంపీలు ఇదే అంశాన్ని లేవనెత్తుతూ నినాదాలు కొనసాగించడంతో డిప్యుటీ చైర్మన్ సభను బుధవారానికి వాయిదా వేశారు.