న్యూఢిల్లీ: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం డిమాండ్, నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారంతోసహా వివిధ కీలక అంశాలపై విపక్ష సభ్యులు సృష్టించిన అవాంతరాల మధ్య పార్లమెంట్ ఉభయ సభలు శుక్రవారం వరుసగా ఐదవరోజు ఎటువంటి కార్యకలాపాలు జరగకుండా వాయిదా పడ్డాయి. వాయిదా అనంతరం మధ్యాహ్నం 12 గంటల తర్వాత లోక్సభ సమావేశమైన సందర్భంగా విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ వైఖరిని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తప్పుపట్టారు.
పేపర్ లీక్పై పార్లమెంట్లో చర్చిద్దామని సూచిస్తూ ప్రభుత్వం అనేకసార్లు ప్రతిపక్ష పార్టీలను సంప్రదించిందని ఆయన గుర్తు చేశారు. చర్చ జరగాలని పలువురు విపక్ష ఎంపీలు ఆశిస్తుండగా చర్చ అవసరాన్ని రాహుల్ గాంధీ తన పార్టీ సభ్యులకు నచ్చచెప్పాలని ఆయన అన్నారు. చర్చకు ముందే సాకులు వెతుకుతూ, షరతులు విధించడం దేశానికి తప్పుడు సంకేతాలు పంపుతుందని రిజిజు చెప్పారు. పేపర్ లీకేజ్లపై కఠినమైన చట్టం తీసుకువస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. అయితే కాంగ్రెస్, ఇతర విపక్ష పార్టీలు మాత్రం ప్రధాన్ రాజీనామా కోసం పట్టుబట్టడం కొనసాగించాయి.
రాజ్యసభలోనూ అదే పరిస్థితి
భోజన విరామం తర్వాత శుక్రవారం మధ్యాహ్నం రాజ్యసభ సమావేశం ప్రారంభమైన వెంటనే నీట్ పేపర్ లీకేజ్, జాతీయ గౌరవానికి అవమానాల నివారణ(సవరణ) బిల్లు, 2026(వందేమాతరం బిల్లు) ప్రవేశపెట్టడం వంటి అంశాలు ప్రధానంగా నిలవడంతో సభ సోమవారానికి వాయిదా పడింది.