న్యూఢిల్లీ, జూలై 1: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 20న ప్రారంభమై మూడు వారాలపాటు కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ(సీసీపీఏ) తుది నిర్ణయం తీసుకోవలసి ఉంది. సాధారణంగా వర్షాకాల, శీతాకాల సమావేశాలు నాలుగు వారాలకు విస్తరించి 20 సిట్టింగ్లతో ఉంటాయి. అయితే తక్కువ కాలం నిర్వహించిన సమావేశాలు కూడా గతంలో ఉన్నాయి. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో బీజేపీ విజయాల తర్వాత మొదటిసారి వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. రానున్న సమావేశాల్లో టీఎంసీ, శివసేన(యూబీటీ)లో తలెత్తిన తిరుగుబాట్లు కీలక భూమికను పోషించనున్నాయి. తమను ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలని కోరుతూ 20 మంది టీఎంసీ, శివసేన(యూబీటీ) ఎంపీల వినతులు ప్రస్తుతం లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పరిశీలనలో ఉన్నాయి.
కొత్తగా ఎన్నికైన సభ్యులు, తిరిగి ఎన్నికైన సభ్యులు ప్రమాణం చేయడంతో రాజ్యసభలో రాజకీయ పార్టీల బలాబలాలు అధికార ఎన్డీయేకు అనుకూలంగా మారాయి. 2029 నాటికి చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం, లోక్సభ స్థానాల సంఖ్యను పెంచడం లక్ష్యంగా ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు దిగువ సభలో వీగిపోవడంతో ప్రభుత్వానికి గత పార్లమెంట్ సమావేశాలు నిరాశతో ముగిశాయి. అన్ని రాష్ర్టాల లోక్సభ స్థానాలను ఏకరీతిగా 50 శాతం వరకు పెంచే ఉద్దేశంతో ప్రభుత్వం ఇప్పుడు ఆ బిల్లును తిరిగి రూపొందిస్తున్నది. జనాభా ప్రాతిపదికన సీట్ల సంఖ్య పెరుగడం దక్షిణాది పార్టీలకు ఒక ప్రధాన ఆందోళనగా మారింది.
ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర క్యాబినెట్ త్వరలో పునర్వ్యవస్థీకరణ జరుగుతుందన్న ఊహాగానాల నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. వర్షాకాల సమావేశాలకు ముందుగానే మంత్రివర్గం పునర్వ్యస్థీకరణను ప్రకటించవచ్చని తెలుస్తున్నది. ఏ క్షణమైనా క్యాబినెట్లో మార్పులు చేర్పులు నిర్వహించే అవకాశం ఉన్నట్లు గత కొన్ని రోజులుగా ఉన్నత స్థాయి నుంచి సూచనలు అందుతున్నాయి. బీజేపీ నూతన అధ్యక్షుడు నితిన్ నబీన్ సారథ్యంలో పార్టీకి కొత్త కార్యవర్గాన్ని కూడా ఇదే సమయంలోనే ప్రకటించే అవకాశం ఉందని తెలిసింది.