న్యూఢిల్లీ, డిసెంబర్ 2: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై రెండో రోజు కూడా పార్లమెంట్ ఉభయ సభలు అట్టుడికాయి. సర్పై సమగ్ర చర్చను డిమాండ్ చేస్తూ పార్లమెంట్ శీతాకాల సమావేశాల రెండో రోజైన మంగళవారం కూడా విపక్షాల రగడ కొనసాగింది. దీంతో లోక్సభ బుధవారానికి వాయిదా పడింది. గడువు పెట్టకపోతే సర్పై చర్చకు తాము సిద్ధమేనని కేంద్రం హామీనిచ్చింది. అంతకుముందు సభ రెండుసార్లు వాయిదా పడిన అనంతరం రెండు గంటలకు సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు నినాదాలు కొనసాగించారు. సర్పై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, సభ సజావుగా జరగడానికి సభ్యులు సహకరించాలని సభకు అధ్యక్షత వహించిన దిలీప్ సైకియా సభ్యులకు విజ్ఞప్తి చేశారు.
కాగా, సెంట్రల్ ఎక్సైజ్ (సవరణ) బిల్లు, 2025ను సభలో ఆమోదించడానికి ప్రవేశపెట్టినా సభలో గందరగోళ పరిస్థితుల మధ్య సాధ్యపడలేదు. అంతకు ముందు 10 నిమిషాల పాటు జరిగిన జీరో అవర్లో స్టాండింగ్ కమిటీ నివేదికలు, వివిధ రకాలు పత్రాలను సభలో ప్రవేశపెట్టారు. సర్పై వెంటనే చర్చను ప్రారంభించాలని ప్రతిపక్ష పార్టీల సభ్యులు నినాదాలు ప్రారంభించారు. ఎన్నికల్లో ఓడిపోయామన్న కోపాన్ని సభలో చూపడం సబబు కాదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, శీతాకాల సమావేశాల తొలిరోజైన సోమవారం కూడా విపక్షాలు ఆందోళన చేయడంతో పలుసార్లు సభకు అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే.
రాజ్యసభలో కూడా రెండో రోజు అదే సీన్ కొనసాగింది. మిగతా అంశాల కన్నా సర్కు ప్రాధాన్యం ఇస్తూ చర్చ జరపాలని విపక్షాలు పట్టుబట్టాయి. అయితే తొలుత వందేభారతం అంశపై చర్చను ప్రారంభిద్దామని మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించగా దానిని విపక్షాలు తిరస్కరించాయి. తొలుత సర్పైనే చర్చను ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశాయి. సర్పై చర్చను కోరుతూ కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, ఆప్, ఎస్పీ, సీపీఎం నేతలు మంత్రి రిజిజును కలిసారు. 14 కన్నా ఎక్కువ పార్టీలు సర్పై చర్చను కోరుకుంటున్నాయని, ఎందుకంటే దీని కారణంగా ప్రజల ప్రాణాలు పోతున్నాయని టీఎంసీ నేత డెరెక్ ఒబ్రెయిన్ అన్నారు.
రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ 267 నిబంధన కింద పలు పార్టీలు దీనిపై చర్చకు డిమాండ్ చేస్తున్నాయన్నారు. సభ అజెండా ఏదైనప్పటికీ రూల్ 267 ప్రకారం మిగిలిన అంశాలను పక్కనబెట్టి తాము కోరిన దానిపై చర్చను ప్రారంభించాలన్నారు. వందేమాతరం తమ నుంచే వచ్చింది తప్ప వారి నుంచి కాదని అన్నారు. దీనికి రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ స్పందిస్తూ వందేమాతరం అందరిదీనని అంటూ సభా కార్యక్రమాల కొనసాగింపునకు ప్రయత్నించగా, సర్పైనే మొదట చర్చించాలని నినాదాలు చేస్తూ విపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.
సర్పై చర్చ కోసం ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో తలెత్తిన ప్రతిష్ఠంభనకు ఎట్టకేలకు తెరపడింది. సర్పై ఈ నెల 9న చర్చకు అధికార పక్షం అంగీకరించింది. కేవలం సర్పైనే కాకుండా ఎన్నికల సంస్కరణలపై చర్చకు తాము సిద్ధమేనని ఇప్పటికే ప్రకటించామని, తొలుత దీనిపై ఈ నెల 8న, ఎన్నికల సంస్కరణలపై ఈ నెల 9న చర్చను నిర్వహిస్తున్నట్టు మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. అన్ని పార్టీలతో జరిగిన అఖిలపక్ష సమావేశం, లోక్సభ స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. ఎన్నికల సంస్కరణలపై జరిగే చర్చలో సభ్యులు ఎన్నికలకు సంబంధించిన అన్ని విషయాలపై చర్చించవచ్చునన్నారు. ఈ రెండు అంశాలపై చర్చలు ముగిసిన తర్వాత దీనిని రాజ్యసభలో చేపట్టాలని ప్రతిపాదిస్తామన్నారు.