న్యూఢిల్లీ, ఆగస్టు 21 : ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్లు, 2025కు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు లోక్‌సభ బుధవారమే ఆమోదం తెలుపగా, గురువారం రాజ్యసభలో ఎటువంటి చర్చ లేకుండానే బిల్లు ఆమోదం పొందింది. ఆన్లైన్ గేములకు ప్రజలు బానిసలు కాకుండా నిరోధించడంతోపాటు మనీలాండరింగ్, ఆర్థికపరమైన మోసాలు, ఆత్మహత్యలను నివారించేందుకు ప్రభుత్వం ఆన్లైన్ గేమ్స్‌పై నిషేధం విధిస్తూ ఈ బిల్లు తీసుకువచ్చింది.ఈ కార్యకలాపాల కోసం బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు నిధుల బదిలీ వంటి కార్యకలాపాలు చేపట్టకుండా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు గురువారం ముగిశాయి. ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. వరుస అంతరాయాలు, వాయిదాలు, వాకౌట్ల మధ్య నెలరోజులపాటు జరిగిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో లోక్‌సభలో 12 బిల్లులు, రాజ్యసభలో 15 బిల్లులు ఆమోదం పొందాయి. జూలై 21న ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాల్లో ఆపరేషన్ సిందూర్ మినహాయించి మరే అంశం చర్చకు నోచుకోలేదు. సమావేశాలు ప్రారంభమైన తొలి రోజుల్లో ఆపరేషన్ సిందూర్‌పై విపక్షాలు చర్చకు పట్టుపట్టిన కారణంగా, తర్వాత బీహార్‌లోని ఎస్ఐఆర్పై చర్చ కోసం ప్రతిపక్షాలు డిమాండు చేయడంతో సభలో చర్చకు తావు లేకుండా పోయింది. చాలా బిల్లులు విపక్ష సభ్యుల నిరసనల మధ్యే మూజువాణి ఓటుతో ఆమోదం పొందగా కొన్ని బిల్లులు ప్రతిపక్షాలు స్వల్ప చర్చతో ఆమోదం పొందాయి.