న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: చార్టర్డ్ అకౌంటెంట్లు, కాస్ట్ అకౌంటెంట్లు, కంపెనీ సెక్రటరీల పనితీరును సంస్కరించేందుకు తీసుకొచ్చినట్టు చెబుతున్న అకౌంటెన్సీ బిల్లుకు మంగళవారం రాజ్యసభ ఆమోద ముద్ర వేసింది. తాజాగా ఆమోదించిన చార్టర్డ్ అకౌంటెంట్స్, కాస్ట్ అండ్ వర్క్ అకౌంటెంట్స్ అండ్ కంపెనీ సెక్రటరీస్ (అమెండ్మెంట్) బిల్లు, 2022 వల్ల ఆయా సంస్థల స్వయంప్రతిపత్తిపై ఎలాంటి ప్రభావం ఉండబోదని, సంస్థల పనితీరులో పారదర్శకత పెరుగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
అయితే, అకౌంటెన్సీ బిల్లు ఆమోదాన్ని సంస్థల స్వయంప్రతిపత్తిపై దాడిగా విపక్షాలు అభివర్ణించాయి. అకౌంటెన్సీ బిల్లు ఆమోదానికి 2.20 గంటల సమయం పట్టినట్టు రాజ్యసభ వర్గాలు తెలిపాయి. క్లాజులవారీగా బిల్లు ఆమోదానికి 200 సార్లు ఓటింగ్ జరిగినట్టు పేర్కొన్నాయి.