న్యూఢిల్లీ, నవంబర్ 29: పార్లమెంట్లో వాయిదాల పర్వం కొనసాగుతున్నది. యూపీలోని సంభల్‌లో చెలరేగిన హింస, అదానీ అవినీతి తదితర అంశాలపై చర్చ జరగాలంటూ విపక్షాలు పట్టుబట్టడంతో ఉభయ సభల కార్యక్రమాలకు శుక్రవారం తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ఉభయ సభలను డిసెంబర్ 2వ తేదీకి వాయిదా వేశారు. తొలుత 11 గంటలకు లోక్‌సభ సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ ఎంపీలు స్పీకర్ స్థానం దగ్గరకు వచ్చి నినాదాలు చేయడం ప్రారంభించారు. ప్రశ్నోత్తరాల సమయంలో రెండు ప్రశ్నలు పూర్తయ్యాయో లేదో తిరిగి సభకు ఆటంకం ఏర్పడటంతో స్పీకర్ ఓం బిర్లా సభను 12 గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభమైన తర్వాత కూడా సభలో నిరసనలు కొనసాగాయి. దీంతో సభను డిసెంబర్ 2వ తేదీకి వాయిదా వేశారు. రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. తామిచ్చిన వాయిదా నోటీసులను చైర్మన్ ధన్కర్ తిరస్కరించడంతో విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. దీంతో చైర్మన్ సభను సోమవారానికి వాయిదా వేశారు.
సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగించేందుకు వాయిదా నోటీసులను విపక్షాలు ఆయుధాలుగా వినియోగిస్తున్నాయని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ ఆరోపించారు. నిబంధన 267 ప్రకారం విపక్షాలు నోటీసులు ఇస్తూ దానిని ఒక ఆయుధంగా వాడుకుంటున్నాయని అన్నారు. ‘విపక్షాలకు నిబంధన 267 సభను అంతరాయం కలిగించే ఆయుధంగా మారింది’ అని ఆయన వ్యాఖ్యానించారు. తనకు విపక్షాల నుంచి 17 నోటీసులు అందాయని తెలిపారు. ఆయన వ్యాఖ్యల అనంతరం ఎంపీలు ప్రధాని మోదీ, అదానీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడం ప్రారంభించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ధన్కర్ ‘మన చర్యలు ప్రజా కేంద్రీకృతంగా లేవు. అవి పూర్తిగా ప్రజా వ్యతిరేకంగా, వారికి సంబంధం లేకుండా ఉన్నాయి. వారు మనల్ని ఎగతాళి చేస్తున్నారు. వాస్తవంగా మనం నవ్వుల పాలయ్యాం’ అని వ్యాఖ్యానిస్తూ సభను సోమవారానికి వాయిదా వేశారు.
అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలు, అమెరికా న్యాయ శాఖకు సంబంధించిన చట్టపరమైన అంశంపై తమకు ఆ దేశం నుంచి ఎలాంటి సమాచారం కానీ, విజ్ఞప్తి కానీ అందలేదని కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది. వారాంతపు సమాచార వివరణలో భాగంగా శుక్రవారం ఆ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ మీడియాతో మాట్లాడుతూ ‘ఇది కొన్ని ప్రైవేట్ సంస్థలు, కొందరు వ్యక్తులు, అమెరికా న్యాయ శాఖలకు సంబంధించిన న్యాయపరమైన అంశంగా మేము చూస్తున్నాం. దీనికి కచ్చితంగా ప్రస్తుతం అమలులో ఉన్న పద్ధతులు, న్యాయపరమైన విధానాలను పాటించాలి. దానిని మేము అనుసరిస్తాం. ఈ విషయంలో భారత ప్రభుత్వానికి యూఎస్ మందస్తు సమాచారం ఇవ్వలేదు’ అని తెలిపారు. సమన్లు, అరెస్ట్ వారెంట్లకు సంబంధించి యూఎస్ నుంచి ఏదైనా విజ్ఞప్తి వస్తే అందులోని యోగ్యతాయోగ్యతలను తమ ప్రభుత్వం పరిశీస్తుందని స్పష్టం చేశారు.