కోల్‌కతా: బాలీవుడ్ నటుడు పరేశ్ రావల్‌కు కోల్‌కతా పోలీసులు సమన్లు జారీ చేశారు. డిసెంబర్ 12వ తేదీన విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. బెంగాలీల కోసం చేపలు వండండి అంటూ పరేశ్ రావల్ ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచార సభలో వ్యాఖ్యలు చేశారు. రావల్ వ్యాఖ్యలను తప్పుపట్టిన సీపీఐ నేత సలీమ్ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు.
గ్యాస్ సిలిండర్ల ధర పెరిగిపోయిందని, కానీ వాటి ధరలు అదుపులోకి వస్తాయని, ప్రజలకు ఉద్యోగాలు కూడా దొరుకుతాయని, కానీ ఢిల్లీలో ఉన్నట్లు మీ చుట్టూ రోహింగ్యాలు, బంగ్లాదేశీలు ఉంటే ఇవన్నీ సాధ్యం అవుతాయా అని రావల్ ఓ ఎన్నికల సభలో ప్రశ్నించారు. అప్పుడు మీరు గ్యాస్ సిలిండర్లతో ఏం చేస్తారని, బెంగాలీలకు చేపలు వండిపెడుతారా అని రావల్ తన ప్రసంగంలో అన్నారు.
నిజానికి తన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెప్పారు పరేశ్ రావల్. ఓ ట్వీట్లో ఆయన స్పందిస్తూ.. చేపలను గుజరాతీలు కూడా తింటారని, బెంగాలీలు అంటే తన ఉద్దేశం రోహింగ్యాలు అని, ఒకవేళ మీ మనోభావాలను దెబ్బతీసి ఉంటే క్షమాపణలు కోరుతానని ఆయన అన్నారు.