Gujarat : గుజరాత్లో తల్లిదండ్రులు తమ కొడుకుపై దారుణానికి పాల్పడ్డారు. మద్యం తాగుతున్నాడని కొడుకును హత్య చేశారు. ఆ తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం చేశారు. మృతుడిని 23 ఏళ్ల రామ్ బాబుభాయ్ బంభవగా గుర్తించారు. ఈ ఘటన గుజరాత్, రాజ్కోట్ జిల్లా, గోండల్ తాలూకా, గుండాల గ్రామంలో ఇటీవల జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుండాల గ్రామానికి చెందిన బాబుభాయ్ అలియాస్ అతుల్భాయ్ గుఘాభాయ్ బంభవ, మనిషాబెన్ అలియాస్ మోతిబెన్ దంపతుల కొడుకు రామ్ బాబుభాయ్. అతడికి నాలుగు నెలల క్రితం బన్షిబెన్ బంబువా అనే యువతితో వివాహమైంది.
అయితే, రామ్ బాబుభాయ్కు అతిగా మద్యం తాగే అలవాటు ఉంది. ఈ విషయంలో అతడికి, తల్లిదండ్రులకు నిత్యం గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో జూన్ 30న కూడా రామ్ బాబుభాయ్ మద్యం సేవించి రావడంతో అతడికి, తల్లిదండ్రులకు మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ఆవేశానికి గురైన రామ్ తల్లిదండ్రులు అతడితో బలవంతంగా యాసిడ్ తాగించారు. అనంతరం గొంతునులిమి చంపేశారు. అయితే, ఈ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు రామ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే, రామ్ తండ్రి తనకున్న రాజకీయ పలుకుబడి వాడుకోవాలని చూశాడు. స్థానిక నేతలను కలిసి.. త్వరగా పోస్టుమార్టం జరిగేలా ఒత్తిడి తెచ్చాడు. అతడి మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని, ఆత్మహత్య చేసుకున్నాడని, కాబట్టి తూతూమంత్రంగా పోస్టుమార్టం పూర్తి చేయాలని కోరారు.
అయితే, రామ్ భార్య బన్షిబెన్ బంబువా ఇచ్చిన ఫిర్యాదుతో అతడి తల్లిదండ్రులపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నిబంధనల ప్రకారం పూర్తిస్థాయి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ పోస్టుమార్టంలో రామ్ హత్యకు గురైనట్లు తేలింది. అతడిపై దాడి జరిగిందని, గొంతునులిమి చంపేశారని వైద్యులు గుర్తించారు. దీంతో రామ్ తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని విచారించగా తమ నేరాన్ని అంగీకరించారు. తామే కొడుకును హత్య చేసినట్లు గుర్తించారు. నిందితుల్ని అరెస్టు చేసిన పోలీసులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.