Tenth Fail | బెంగళూరు : 10వ తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థులు ఇంటా, బయటా తీవ్ర అవమానాలు ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఇంట్లో తల్లిదండ్రుల నుంచి ఎదురయ్యే దూషణలు అంతా ఇంతా కాదు. అయితే కర్ణాటకలో ఓ విద్యార్థి తల్లిదండ్రులు ఇందుకు భిన్నంగా స్పందించారు. చుట్టుపక్కల వాళ్లను పిలిచి.. కేక్ తెప్పించి కట్ చేయించి.. చిన్నపాటి వేడుక నిర్వహించారు. మరోసారి పరీక్షలు రాసి పాస్ అవ్వాలంటూ కొడుకుకు నచ్చజెప్పారు.
కర్ణాటకలోని బాగల్కోట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక్కడి ఓ ఇంగ్లిష్ మీడియం స్కూల్ విద్యార్థి అభిషేక్.. టెన్త్‌లో అన్ని సబ్జెక్ట్‌ల్లో ఫెయిలయ్యాడు. మొత్తం 600 మార్కులకుగాను 200 మార్కులు మాత్రమే వచ్చాయి. తోటి విద్యార్థులు, స్నేహితులు అతడ్ని అవహేళన చేశారు. అయితే తమ కుమారుడి పరిస్థితి అర్థం చేసుకున్న తల్లిదండ్రులు అతడికి మద్దతుగా నిలిచారు. ‘ఇది నిరాశపరిచే ఫలితమే. కానీ ప్రపంచం దీంతోనే ఆగిపోయినట్టు కాదు. మరోసారి పరీక్షలు రాసి సక్సెస్ అవుతాడు’ అంటూ కుమారుడ్ని ప్రోత్సహించే మాటలు చెప్పారు. కేక్ తెప్పించి అభిషేక్‌తో కట్ చేయించారు.