న్యూఢిల్లీ : చదువుకోవడానికి అయ్యే ఖర్చులను తల్లిదండ్రుల నుంచి పొందే హక్కు కుమార్తెలకు ఉందని సుప్రీంకోర్టు చెప్పింది. ఇది కుమార్తెలకు గల తోసిపుచ్చలేని, చట్టబద్ధంగా అమలు చేయదగిన, ప్రామాణిక హక్కు అని వివరించింది. భార్యాభర్తలు విడిపోయిన కేసులో, వారి కుమార్తె ఐర్లాండ్లో చదువుకుంటున్నారు. భర్త తన భార్యకు, కుమార్తెకు కలిపి రూ.73 లక్షలు చెల్లించేందుకు అంగీకరించారు. ఈ సొమ్ములో రూ.43 లక్షలు తన కుమార్తె చదువు ఖర్చుల కోసం ఇస్తున్నట్లు తెలిపారు. భార్య రూ.30 లక్షలు స్వీకరించారు. భార్యాభర్తలిద్దరూ వేర్వేరుగా జీవిస్తున్నారు. కుమార్తె కోసం తండ్రి రూ.43 లక్షలు పంపించగా, ఆమె తిరస్కరించింది. ఈ సొమ్మును తీసుకునేందుకు చట్టబద్ధ హక్కు కుమార్తెకు ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది.