న్యూఢిల్లీ: రిసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్(రా) తదుపరి కార్యదర్శిగా పంజాబ్ కేడర్‌కి చెందిన 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి పరాగ్ జైన్‌ని శనివారం కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆయన పదవీకాలం రెండేళ్లు ఉంటుంది. జూన్ 30న పదవీకాలం పూర్తి చేసుకోనున్న రవి సిన్హా స్థానంలో పరాగ్ జైన్ నియమితులయ్యారు. ప్రస్తుతం విమానయాన పరిశోధనా కేంద్రానికి అధిపతిగా జైన్ ఉన్నారు. ఆపరేషన్ సిందూర్ కాలంలో పాకిస్థానీ సాయుధ దళాల గురించి కీలక నిఘా సమాచారాన్ని రాబట్టడంలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషించింది. గతంలో పంజాబ్ ఉగ్రవాద రోజుల్లో భటిండ, మాన్స, హోషియార్‌పూర్‌లో పని చేయడంతోపాటు చండీగఢ్ ఎస్ఎస్పీగా, లూధియానా డీఐజీగా జైన్ చురుకైన పాత్ర పోషించారు.