లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా జిల్లా కలెక్టర్ సోషల్ మీడియా పోస్ట్‌పై ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీని (Rahul Gandhi) ‘పప్పు’గా ఆ పోస్ట్‌లో పేర్కొనడంపై మండిపడింది. గౌతమ్ బుద్ధనగర్ జిల్లా మేజిస్ట్రేట్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. శుక్రవారం నోయిడా జిల్లా కలెక్టర్ ఎక్స్ పోస్ట్‌లో రాహుల్‌ను పప్పుగా పేర్కొనడం ఆమోదించలేని వ్యాఖ్య అని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఇది కొత్త పరిణామం కాదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ కమ్యూనికేషన్స్ ఇన్ఛార్జ్ జైరాం రమేష్ అన్నారు. గత పదేళ్లుగా దేశంలోని బ్యూరోక్రసీ, ఇతర రాజకీయేతర అధికారులు రాజకీయంగా మారారని ఎక్స్‌లో విమర్శించారు. నియమ నిబంధనలు ఉల్లంఘించిన ఆ అధికారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
కాగా, నోయిడా జిల్లా కలెక్టర్ మనీష్ వర్మపై దీనిపై స్పందించారు. కొంతమంది సంఘ వ్యతిరేక వ్యక్తులు తన ఐడీ కార్డును దుర్వినియోగం చేశారని ఆరోపించారు. తప్పుడు వ్యాఖ్యలతో ఎక్స్‌లో పోస్ట్ చేశారని ప్రకటించారు. దీనిని తీవ్రంగా పరిగణించడంతోపాటు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. తప్పుడు ట్వీట్, వ్యాఖ్య చేసిన వారిని గుర్తించేందుకు సైబర్ సెల్ దర్యాప్తు చేస్తోందని చెప్పారు. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎక్స్‌లో పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్ కాపీని కూడా అందులో పోస్ట్ చేశారు.
— DM G.B. Nagar/NOIDA (@dmgbnagar) September 13, 2024