శ్రీనగర్: పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ (India Pakistan) సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. గత పదిరోజులుగా నియంత్రణ రేఖ వెంబడి భారత్‌పై పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ వస్తున్నది. ప్రతి రోజూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘిస్తునే ఉంది. వరుసగా పదో రోజు.. అంటే శనివారం అర్థరాత్రి కూడా దేశ సరిహద్దుల్లోని కుప్వారా, బారాముల్లా, పూంచ్, రాజోరి, నౌషిరా, సుందర్బనీ, అక్నూర్ జిల్లాల్లోని సైనికుల పోస్టులే లక్ష్యంగా పాకిస్థాన్ రేంజర్లు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భారత్ సైన్యం వెంటనే స్పందించి.. పాక్ దళాలకు ధీటుగా సమాధానమిచ్చింది. ఈ కాల్పుల ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఏప్రిల్ 22వ తేదీన పహల్గాంలో పర్యాటకులే లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 26 మంది మరణించారు.
భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో ఓ పాకిస్థాన్ రేంజర్ భారత్‌లోకి అక్రమంగా చొరబడేందుకు విఫలయత్నం చేశాడు. అయితే అప్రమత్తంగా ఉన్న సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) అతనిని అదుపులోకి తీసుకుంది. నియంత్రణ రేఖ వెంబడి రాజస్థాన్‌లోని శ్రీ గంగా నగర్ సమీపంలో ఈ సంఘటన జరిగింది. అతనిని బీఎస్ఎఫ్, నిఘా అధికారులు ప్రశ్నిస్తున్నా రు. చొరబడటానికి కారణాలేమిటో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నా రు. భారత సైన్యం కదలికలు, వ్యూహాలను తెలుసుకునేందుకు వచ్చాడా? అనే విషయాన్ని ఆరా తీస్తున్నారు.