Ceasefire violation : ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) తో తీవ్రంగా దెబ్బకొట్టినా పాకిస్థాన్ (Pakistan) సైన్యం తీరుమారలేదు. మరోసారి బరితెగించి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. సరిహద్దుల్లో భారత స్థావరాలపై కాల్పులకు పాల్పడింది. జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లోని లీపా వ్యాలీ (Leepa valley) లో అక్టోబర్ 26, 27 తేదీల నడుమ వచ్చే రాత్రి ఈ ఘటన జరిగింది.
కాల్పులు, మోర్టార్ దాడులకు పాల్పడింది. అయితే భారత సైన్యం పాకిస్థాన్‌కు ధీటుగా బదులిచ్చింది. పాకిస్థాన్ దాడిని సమర్థంగా తిప్పికొట్టింది. భారత జవాన్లు తీవ్రంగా ప్రతిఘటించడంతో పాక్ సైనికులు తోకముడిచారు. కాగా పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా అప్పట్లో ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సైన్యం పాకిస్థాన్‌పై సర్జికల్ స్ట్రైక్స్‌కు పాల్పడింది. దాంతో పాక్ కాళ్లబేరానికి వచ్చింది.
ఫలితంగా ఈ ఏడాది మే 10 నుంచి రెండు దేశాల సైనికుల మధ్య నియంత్రణ రేఖ వెంబడి ఎలాంటి ఘటనలు చోటుచేసుకోలేదు. అంతా ప్రశాంతంగా ఉంది. కానీ తాజాగా పాకిస్థాన్ మళ్లీ బరితెగించడం ఆ దేశం వక్రబుద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది.