న్యూఢిల్లీ: సుమారు 300 నుంచి 400 టర్కీ డ్రోన్లతో పాకిస్థాన్ దాడి చేసిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సరిహద్దుల్లోని 36 ప్రదేశాలను పాక్ లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడిందని పేర్కొంది. అయితే భారత సైనిక దళాలు సమర్థవంతంగా పాక్ డ్రోన్లను కూల్చివేసినట్లు వెల్లడించింది. ఆపరేషన్ సిందూర్‌కు (Operation Sindoor) సంబంధించిన తాజా వివరాలను విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి, కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మీడియాకు వివరించారు.
కాగా, మే 8-9వ తేదీల మధ్య రాత్రి వేళ భారత్‌లోని 36 నగరాలపై జరిగిన దాడిలో 300 నుంచి 400 వరకు టర్కిష్ డ్రోన్లను పాకిస్తాన్ సైన్యం ప్రయోగించిందని వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తెలిపారు. భారత్ ధీటుగా ప్రతిస్పందించిందని చెప్పారు. పాక్ డ్రోన్లను కూల్చివేసినట్లు వెల్లడించారు. కూలిన డ్రోన్ శిథిలాలను ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపగా టర్కీలో తయారైన ‘అసిస్‌గార్డ్ సోంగర్’ మోడల్ డ్రోన్స్గా నిర్ధారణ అయ్యిందన్నారు.
మరోవైపు పాకిస్థాన్‌లోని నాలుగు వైమానిక రక్షణ ప్రదేశాలపై సాయుధ డ్రోన్లను భారత్ ప్రయోగించినట్లు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తెలిపారు. ఆ డ్రోన్స్‌లో ఒకటి ఏడీ రాడార్‌ను నాశనం చేసిందని చెప్పారు.
కాగా, నియంత్రణ రేఖ వెంబడి భారీ క్యాలిబర్ ఆయుధాలతో పాక్ కాల్పులు జరిపిందని, పంజాబ్‌లోని బటిండా సైనిక స్థావరంపై దాడికి ప్రయత్నించిందని కల్నల్ సోఫియా ఖురేషి తెలిపారు. భారత్ జరిపిన ప్రతీకార కాల్పుల్లో పాకిస్థాన్ సైన్యానికి కూడా భారీ నష్టం వాటిల్లిందని వివరించారు.
మరోవైపు భారత్‌తో నెలకొన్న ఉద్రిక్తతలకు మతం రంగు పులిమేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తున్నదని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి ఆరోపించారు. దీనిని తిప్పికొట్టడంతోపాటు వాస్తవాన్ని అంతర్జాతీయ సమాజానికి భారత్ తెలియజేస్తున్నదని వివరించారు.