న్యూఢిల్లీ, ఏప్రిల్ 25 : పొరపాటున పాకిస్థాన్ సరిహద్దుల్లోకి చొరబడిన బీఎస్ఎఫ్ జవాన్‌ను అప్పగించేందుకు పాకిస్థాన్ రేంజర్లు వరుసగా మూడవ రోజు నిరాకరించారు. ఆ జవాన్ ఆచూకీ చెప్పడానికి కూడా రేంజర్లు ఇష్టపడడం లేదని అధికార వర్గాలు శుక్రవారం తెలిపాయి. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లా వెంబడి ఉన్న ఓ పొలంలో బీఎస్ఎఫ్కు చెందిన జవాన్ కానిస్టేబుల్ పూర్ణం సాహును పాకిస్థాన్ రేంజర్లు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. జవాన్ విడుదల కోసం పాక్ రేంజర్లను పలుమార్లు సంప్రదించి చర్చలను కోరినప్పటికీ అవతలి వైపు నుంచి ఇప్పటివరకు సానుకూల స్పందన లేదు. పహల్గాం ఉగ్ర దాడి తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించిన తరుణంలో ఈ ఘటన జరగడం ఆందోళన కలిగిస్తోంది.
జవాన్ విడుదల కోసం రేంజర్లతో ఫీల్డ్ కమాండర్ స్థాయి సమావేశం నిర్వహించాలని బీఎస్ఎఫ్ పాక్‌ను కోరుతూనే ఉందని వర్గాలు తెలిపాయి. సాహు క్షేమంగా తిరిగిరావాలని పశ్చిమ బెంగాల్ హూగ్లీలో నివసిస్తున్న అతని కుటుంబ సభ్యులు ప్రార్థిస్తున్నారు. తన కుమారుడు దేశానికి సేవ చేస్తున్నాడని, అతను క్షేమంగా ఉన్నాడో లేడో కూడా తమకు తెలియడం లేదని సాహు తండ్రి భోలానాథ్ సాహు తెలిపారు. అతను పాకిస్థానీ బందీగా ఉన్నట్లు తమకు తెలిసిందని ఆయన చెప్పారు. తమ కుమారుడిని క్షేమంగా తీసుకురావాలని ఆయన అధికారులను కోరారు.