న్యూఢిలీ, అక్టోబర్ 27: పాకిస్థాన్ మరోమారు కవ్వింపు చర్యలకు దిగింది. జమ్ములోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాక్ రేంజర్లు యథేచ్ఛగా కాల్పులకు తెగబడ్డారు. భారత పోస్టులు, పౌర ఆవాసాలే లక్ష్యంగా దాదాపు ఏడు గంటలపాటు మోర్టార్లు ప్రయోగించారు. భారీ మెషీన్ గన్స్‌తో కాల్పులు జరిపారు.
ఈ ఘటనలో బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ బస్వరాజ్ రెండు చేతులకు గాయాలు కాగా, అర్నియా సెక్టార్‌కు చెందిన రజ్నీదేవి అనే స్థానికురాలు గాయపడింది. పాక్ వైపు నుంచి గురువారం రాత్రి 8 గంటలకు ప్రారంభమైన కాల్పులు శుక్రవారం తెల్లవారుజామున 2.45 గంటలకు వరకు కొనసాగినట్టు బీఎస్ఎఫ్ తెలిపింది. పాక్ కాల్పులను భారత జవాన్లు సమర్థంగా తిప్పికొట్టారు. జమ్ము జిల్లాలోని అర్నియా, ఆర్‌ఎస్‌పురా సెక్టర్లలోనూ కాల్పులు కొనసాగాయి. పాక్ కాల్పుల నేపథ్యంలో సరిహద్దు గ్రామాల ప్రజలు రాత్రంతా బంకర్లలో తలదాచుకుని కాల్పులు ఆగిన తర్వాత తిరిగి ఇళ్లకు చేరుకున్నారు.