Ind vs Pak : భారతదేశానికి అత్యంత కీలకమైన బంగాళాఖాతం (Bay of Bengal) లో వ్యూహాత్మక ఉనికిని చాటుకోవడానికి పాకిస్థాన్ నౌకాదళం (Pakistan Navy) సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. చైనా (China) సాయంతో తమ నౌకాదళంలోకి కొత్తగా చేర్చుకున్న అత్యాధునిక హ్యాంగర్ క్లాస్ జలాంతర్గాముల (Hanger class Submerines) ను ఈ ప్రాంతంలో మోహరించాలని పాకిస్థాన్ భావిస్తున్నది. 1971 యుద్ధంలో భారత్ చేతిలో ఘోర పరాజయం తర్వాత బంగాళాఖాతంలో పాకిస్థాన్ సైనిక ఉనికి పూర్తిగా లేకుండా పోయింది. అయితే చైనాలో తయారైన మొదటి హ్యాంగర్ జలాంతర్గామి గత వారం కరాచీ నౌకాదళ స్థావరానికి చేరుకోవడంతో.. దాని సాయంతో హిందూ మహాసముద్రంలో తమ పరిధిని విస్తరించుకోవచ్చని పాక్ భావిస్తున్నది.
శ్రీలంకలోని కొలంబో ఓడరేవుకు వచ్చిన ఒక పాకిస్థాన్ యుద్ధ నౌక వేదికగా అక్కడి కమాండర్ ఒమర్ ఫారూఖ్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనాతో కుదుర్చుకున్న భారీ రక్షణ ఒప్పందంలో భాగంగా పాకిస్థాన్ మొత్తం ఎనిమిది హ్యాంగర్ క్లాస్ జలాంతర్గాములను కొనుగోలు చేస్తోంది. వీటిలో నాలుగు చైనాలో తయారు కానుండగా.. మిగిలిన నాలుగింటిని కరాచీలోనే నిర్మిస్తారు. ఈ జలాంతర్గాములలో శత్రువుల రాడార్లకు చిక్కకుండా ఎక్కువ రోజులపాటు సముద్రం లోపలే మునిగి ఉండేలా గాలితో సంబంధం లేని అత్యాధునిక చోదక సాంకేతికతను ఉపయోగించారు. ఇవి తమ నౌకాదళ బలాన్ని పూర్తిగా మార్చేస్తాయని పాకిస్థాన్ అధికారులు ధీమా వ్యక్తంచేస్తున్నారు.
బంగాళాఖాతంలో విశాఖపట్నం వేదికగా ఉన్న భారత తూర్పు నౌకాదళ స్థావరానికి, ప్రధాన వాణిజ్య సముద్ర మార్గాలకు ఈ పరిణామం సవాలుగా మారే ప్రమాదం ఉంది. పైగా ఇటీవల బంగ్లాదేశ్, పాకిస్థాన్ దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు, వాణిజ్యం, సైనిక బంధాలు బలపడటం కూడా ఈ వ్యూహానికి కలిసి వస్తోంది. అయితే భారత్ ఇప్పటికే బంగాళాఖాతంలో అణు జలాంతర్గాములు, విమాన వాహక నౌకలతో అత్యంత శక్తిమంతమైన ఉనికిని కలిగి ఉంది. అండమాన్ నికోబార్ దీవులలో కూడా భారత్ తన రక్షణ సామర్థ్యాలను నిరంతరం పెంచుకుంటూనే ఉంది.