న్యూఢిల్లీ: పాకిస్థాన్ డ్రోన్లు మానవ ప్రాణాలకు ముప్పు కలిగించే పేలుడు పదార్థాలను మోసుకెళ్తుండగా, భారత డ్రోన్లు కోవిడ్ యోధుడి పాత్ర పోషించి ప్రాణాలను రక్షించే వ్యాక్సిన్లు, మందులను మోసుకెళ్తున్నాయని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. రెండు దేశాల మధ్య ఉన్న ప్రాథమిక వ్యత్యాసం ఇదేనని ఆయన అన్నారు. కోవిడ్-19 వ్యాక్సిన్లతో పాటు అత్యవసర మందులను తక్కువ సమయంలో మందులు అందుబాటులో లేని, కష్టతరమైన ప్రాంతాలకు రవాణా చేయడానికి డ్రోన్‌తో నడిచే మొట్టమొదటి ఏరియల్ డెలివరీ సదుపాయాన్ని ఆయన ప్రారంభించారు. అంతర్జాతీయ సరిహద్దు (ఐబి) సమీపంలోని మర్హ్ ప్రాంతంలో డ్రోన్ ద్వారా 50 కోవిడ్-19 వ్యాక్సిన్ల మొదటి సరుకును చేర్చారు.
ఈ సందర్భంగా మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడారు. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) చొరవతో బెంగుళూరులో స్వదేశీంగా అభివృద్ధి చేసిన ‘ఆక్టాకాప్టర్’ డ్రోన్ నిజంగా శాంతి దూత అని కొనియాడారు. కోవిడ్ నుండి ప్రాణాలను రక్షించే సందేశాన్ని భారత డ్రోన్ అంతర్జాతీయ సరిహద్దు వరకు తీసుకువెళ్లిందని, ప్రతి ఒక్కరి ఆరోగ్యం, శ్రేయస్సును నిర్ధారిస్తున్నదని అన్నారు. అయితే పాకిస్థాన్ మాత్రం శాంతికి విఘాతం కలిగించడానికే డ్రోన్‌ను ఉపయోగిస్తోందని ఆయన విమర్శించారు.