న్యూఢిల్లీ, ఏప్రిల్ 29 : పహల్గాం ఉగ్రదాడి దరిమిలా భారత్తో ఉద్రిక్తతలు పెరిగిన తరుణంలో జమ్ము కశ్మీరులోని నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి పాకిస్థానీ బలగాలు సోమవారం రాత్రి వరుసగా ఐదో రోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. పాక్ దళాల కవ్వింపు కాల్పులకు భారత దళాలు దీటుగా సమాధానమిచ్చినట్లు మంగళవారం అధికారులు తెలిపారు. కుప్వారా, బారాముల్లా జిల్లాలతోపాటు అక్నూర్ సెక్టార్ సమీప ప్రాంతాలలో పాక్ సైనిక బలగాలు కాల్పులు జరిపినట్లు అధికారులు చెప్పారు. గురువారం రాత్రి నుంచి పాకిస్థానీ సైనికులు ఎల్వోసీ వెంబడి వివిధ ప్రాంతాలలో భారత బలగాలపై కాల్పులు జరుపుతున్నారు. అయితే ప్రాణ నష్టం జరిగినట్లు వార్తలు రాలేదు.