న్యూఢిల్లీ, జనవరి 25: ప్రముఖ రంగాల్లో విశిష్ట సేవలందించే వారికి ఏటా ఇచ్చే ప్రతిష్టాత్మక పద్మ పౌర పురస్కారాలను కేంద్రప్రభుత్వం ప్రకటించింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం రాత్రి ఈ జాబితా విడుదల చేసింది. 2021 సంవత్సరానికి గానూ నలుగురికి దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారంగా పిలిచే పద్మవిభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 107 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది. హెలికాప్టర్ ప్రమాదంలో ఇటీవల ప్రాణాలు కోల్పోయిన సీడీఎస్ బిపిన్ రావత్‌తో పాటు మహారాష్ట్రకు చెందిన ప్రభా ఆత్రే, రాధేశ్యామ్ ఖేమ్కా (మరణానంతరం), కల్యాణ్‌సింగ్ (మరణానంతరం)లకు పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. కరోనా కట్టడికి స్వదేశీ పరిజ్ఞానంతో తొలి టీకా కొవాగ్జిన్‌ను అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్ల దంపతులు (సంయుక్తంగా), కరోనా మరో టీకా కొవిషీల్డ్‌ను తయారు చేసిన సీరం సంస్థ వ్యవస్థాపకులు సైరస్ పూనావాలా, కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్, సీపీఎం నేత బుద్ధదేవ్ భట్టాచార్య, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తదితరులు పద్మభూషణ్ పురస్కారం వరించినవారి జాబితాలో ఉన్నారు. ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా, ఒలింపియన్స్ ప్రమోద్ భగత్, వందన కటారియా, సింగర్ సోనూనిగమ్ తదితరులు పద్మశ్రీ జాబితాలో ఉన్నారు. మొత్తంగా 128 పద్మ అవార్డుల్లో రెండు అవార్డులను సంయుక్తంగా ప్రకటించారు. పద్మ అవార్డులు వరించిన వారిలో 34 మంది మహిళలు కాగా, 10 మంది విదేశీ/ఎన్ఆర్ఐ/పీఐవో/ఓసీఐ క్యాటగిరీలో ఉన్నారు. 13 మందికి మరణానంతరం అవార్డులను ప్రకటించారు.
పద్మవిభూషణ్
సీడీఎస్ బిపిన్ రావత్: భారత సైన్యాధ్యక్షుడిగా, దేశానికి తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్)గా అత్యుత్తమ సేవలు అందించారు. సైనికుడి కుమారుడైన ఆయన.. తండ్రి విధులు నిర్వర్తించే బెటాలియన్‌లోనే చేరి, అంచెలంచెలుగా ఎదిగి త్రిదళాధిపతి స్థాయికి చేరారు. 2016లో పాక్‌పై సర్జికల్ స్ట్రైక్స్‌లో కీలకపాత్ర పోషించారు. తమిళనాడులో గత నెలలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు.
కల్యాణ్ సింగ్: ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం. బీజేపీ సీనియర్ నేత. ఎమర్జెన్సీ సమయంలో 21 నెలలు జైల్లో గడిపారు. 1992 డిసెంబర్ 6న అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో ఈయనే సీఎంగా ఉన్నారు. 60 ఏండ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో 10 సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు సీఎంగా, రెండుసార్లు ఎంపీగా, రెండు రాష్ర్టాలకు గవర్నర్‌గా పనిచేశారు. అనారోగ్యంతో గతేడాది మరణించారు.
ప్రభా ఆత్రే: హిందుస్తానీ గాయని. సంప్రదాయ సంగీతంలో ప్రఖ్యాతిగాంచిన కిరాణా ఘరానాకు చెందిన అనుభవజ్ఞులైన గాయకుల్లో ఒకరు. భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేశారు. 1990లో పద్మశ్రీ, 2002లో పద్మవిభూషణ్ అందుకొన్నారు. సంగీతంపై హిందీ, ఇంగ్లిష్ భాషల్లో రాసిన 11 పుస్తకాలను ఒకే వేదికపై విడుదల చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పారు.
l రాధేశ్యామ్ ఖేమ్కా: గోరఖ్‌పూర్‌లోని గీతాప్రెస్ అధినేత. ఆధ్యాత్మిక మాసపత్రిక కల్యాణ్‌కు ఎడిటర్‌గా పనిచేశారు. సనాతన మత గ్రంథాల ప్రచురణ ద్వారా విశ్వశాంతికి పాటుపడ్డారు. అనారోగ్య కారణాలతో గతేడాది ఏప్రిల్‌లో కన్నుమూశారు.
పద్మభూషణ్
గులాంనబీ ఆజాద్ (పబ్లిక్ అఫైర్స్), విక్టర్ బెనర్జీ (ఆర్ట్), గుర్మీత్ బావా (ఆర్ట్), బుద్ధదేవ్ భట్టాచార్య (పబ్లిక్ అఫైర్స్), నటరాజన్ చంద్రశేఖరన్ (ఇండస్ట్రీ), క్రిష్ణ ఎల్ల-సుచిత్ర ఎల్ల (ఇండస్ట్రీ), మధుర్ జఫేరీ (ఇతర రంగం), దేవేంద్ర ఝజ్హారియా (స్పోర్ట్స్), రషీద్ ఖాన్ (ఆర్ట్), రాజీవ్ మెహ్రిషీ (సివిల్ సర్వీస్), సత్యనాదెల్లా (ఇండస్ట్రీ), సుందర్ పిచాయ్ (ఇండస్ట్రీ), సైరస్ పూనావాలా (ఇండస్ట్రీ), సంజయ రాజారాం (సైన్స్ అండ్ ఇంజినీరింగ్), ప్రతిభా రాయ్ (సాహిత్యం), స్వామి సచ్చిదానంద్ (సాహిత్యం), వశిష్ట్ త్రిపాఠి (సాహిత్యం).
గులాంనబీ ఆజాద్: కాంగ్రెస్ సీనియర్ నేత. జమ్ముకశ్మీర్ మాజీ సీఎం. 50 ఏండ్ల రాజకీయ జీవితంలో ఎన్నో కీలక పదవులు చేపట్టారు.
సత్య నాదెళ్ల: మైక్రోసాఫ్ట్ సీఈవో. ఏపీలో పుట్టిన ఈయన.. హైదరాబాద్‌లో స్కూల్ విద్యను పూర్తి చేశారు. 2014లో మైక్రోసాఫ్ట్‌కు సీఈవో అయ్యారు.
అవార్డును నిరాకరించిన బుద్ధదేవ్ భట్టాచార్య
కేంద్రం తనకు ప్రకటించిన పద్మభూషణ్ అవార్డును తిరస్కరిస్తున్నట్టు సీపీఎం నేత బుద్ధదేవ్ భట్టాచార్య ప్రకటించారు. తనకు అవార్డు వచ్చినట్టు ఎవరూ చెప్పలేదని, ఒకవేళ పురస్కారం ఇస్తే.. తాను నిరాకరిస్తానని ఆయన అన్నారు. అయితే, బుద్ధదేవ్‌కు పద్మభూషణ్ అవార్డును ప్రకటించనున్నట్టు కేంద్ర హోంశాఖ ఆయన సతీమణికి ముందుగానే తెలియజేసిందని, అప్పుడు కుటుంబసభ్యులు ఎవరూ వ్యతిరేకించలేదని అధికారవర్గాలు తెలిపాయి.
పద్మశ్రీ ఆఫర్‌ను తిరస్కరించిన సంధ్యా ముఖర్జీ
పద్మశ్రీ ఇస్తామని కేంద్రం ప్రకటించిన ఆఫర్‌ను ప్రముఖ బెంగాలీ గాయని సంధ్యా ముఖర్జీ (సంధ్యా ముఖోపాధ్యాయ) తిరస్కరించారు. ఈ మేరకు పురస్కారాన్ని ప్రకటించనున్నట్టు అధికారులు తెలియజేసినప్పుడు ఆమె బదులిచ్చినట్టు సమాచారం. ఎనిమిది దశాబ్దాలు గాయకురాలిగా కళారంగానికి ఎంతో సేవచేసిన 90 ఏండ్ల ప్రముఖురాలికి పద్మశ్రీని ఇస్తామనడం కించపరచడమేనని సంధ్యా కుమార్తె సౌమీ సేన్‌గుప్తా పేర్కొన్నారు.