హైదరాబాద్, నవంబర్ 16(నమస్తే తెలంగాణ): దలైలామా జీవిత చరిత్రను హిందీలో రచించడం ఎంతో సంతోషకరమని పద్మవిభూషణ్ అవార్డుగ్రహిత డాక్ట ర్ కరణ్‌సింగ్ పేర్కొన్నారు. ఆదివారం ప్రఖ్యాత జర్నలిస్ట్, ప్రముఖుల జీవిత కథల రచయిత డాక్టర్ అరవింద్‌యాదవ్ హిందీలో రచించిన 14వ దలైలామా తొలి జీవిత చరిత్రను ఆదివారం ఢిల్లీలోని ఇండియన్ ఇంటర్నేషనల్ సెంటర్లో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భం గా పుస్తకం తొలి ప్రతిని పద్మవిభూషణ్ అవార్డుగ్రహిత డాక్టర్ మురళీమనోహర్ జోషికి అందజేశారు.
ఢిల్లీ టిబెట్ హౌస్ డైరెక్టర్ గెషే దోర్జీ దందూల్ ఈ కార్యక్రమానికి దలైలామా అధికార ప్రతినిధిగా హాజరయ్యారు. అనంతరం కరణ్‌సింగ్ మాట్లాడుతూ.. బౌద్ధ గురువు జీవిత చరిత్రను పరిచయం చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. దలైలామా జీవితాన్ని, బోధనలను కళ్లకు కట్టే ఈ కొత్త జీవిత కథ భారత సాహిత్యానికి గొప్ప సంపద అని పేర్కొన్నారు. భిన్న ధర్మాల గురించి అనేక వర్గాల ప్రజలకు అవగాహనను పెంచుతుందని అభిప్రా యం వ్యక్తంచేశారు. ఈ పుస్తక రచనలో డాక్టర్ అరవింద్‌యాదవ్ విశేష కృషిని, సాహిత్య సేవలో అంకితభావాన్ని ప్రశంసించారు.