న్యూఢిల్లీ : రాష్ట్రపతి భవన్ దర్భార్ హాల్లో సోమవారం రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు తీసుకునేందుకు వచ్చిన యోగా గురు స్వామి శివానంద కాళ్లకు చెప్పులు లేకుండా నిరాడంబరంగా కనిపించారు. ఆడియన్స్ నుంచి 125 ఏండ్ల స్వామి శివానంద స్టాండింగ్ ఒవేషన్ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో స్వామి శివానంద తెల్లని కుర్తా, ధోతీతో పాల్గొన్నారు. అవిభక్త బారత్‌లోని సిల్హెట్ జిల్లాలో జన్మించిన స్వామి శివానంద తన చిన్ననాట పేదరికం అనుభవించారు. ఆయన జీవితమంతా మానవ కళ్యాణం కోసం అంకింతం చేశారు. ఆరేండ్లకే అమ్మానాన్నలను కోల్పోవడంతో ఆయనను బెంగాల్‌లోని నవద్వీప్ గురూజీ ఆశ్రమానికి అప్పగించారు.
గురు ఓంకారానంద గోస్వామి స్వామి శివానందకు అన్నీ తానై ఆధ్యాత్మిక విద్యను బోధించారు. స్వామి శివానంద అత్యంత క్రమశిక్షణతో యోగాలో నిష్ణాతుడై దేశంలోనే ప్రముఖ గురువుగా వెలుగొందారు. ఆయన క్రమశిక్షణతో కూడిన జీవితంతో పాటు స్వామి శివానంద ఆహారపు అలవాట్లు కూడా అందరికీ ఆదర్శప్రాయమైనవని చెబుతారు. వీటిని అనుసరించడం కష్టమైనా స్వామి శివానంద సుదీర్ఘ ఆరోగ్యకరమైన జీవనానికి ఆయన ఆహార అలవాట్లు కారణం. తాను ఎప్పుడూ సాధారణ, సహజ ఆహారాన్నే తీసుకుంటానని ఆయన చెబుతుంటారు. నూనె, మసాలాలు లేని ఆహారంతో పాటు కొద్ది మోతాదులో అన్నం, పప్పు తీసుకుంటారు.
తాను నిరాడంబర, క్రమశిక్షణతో కూడిన జీవితం ఆస్వాదిస్తానని ఆయన చెబుతుంటారు. ఫ్యాన్సీ ఫుడ్స్‌గా ఆయన చెప్పే పాలు, పండ్లకు కూడా స్వామి శివానంద దూరం. తాను ఎలాంటి నూనె, మసాలాలు లేని ఉడికించిన ఆహారాన్నే తీసుకుంటానని.. రెండు పచ్చిమిరపకాయలతో అన్నం, పప్పు తీసుకుంటానని ఆయన చెబుతారు. 125 ఏండ్ల వయసులోనూ స్వామి శివానంద ఫిట్‌గా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఉండటం విశేషం. తెల్లవారుజామున 3 గంటలకే ఆయనకు రోజు మొదలవుతుంది. స్వామి శివానంద ఆరోగ్యకరమైన సుదీర్ఘ జీవితంపై అంతర్జాతీయ మీడియా సంస్ధలూ దృష్టిసారించాయి.