బెంగళూరు, ఆగస్టు 10: ‘ఏదైనా ట్రాన్స్ఫర్ డీల్ ఉందా? అయితే ఇక్కడున్న క్యూఆర్ కోడ్‌కు రూ.6 నుంచి 8 లక్షల వరకు పంపండి. మంత్రి చలువరాయస్వామి, కాంగ్రెస్‌కు చెల్లింపులు జరపండి. పేసీఎస్ కరో!’ అంటూ గురువారం మండ్య జిల్లా కేంద్రంలో వెలిసిన పోస్టర్లు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. పోలీసులు ఈ పోస్టర్లను తొలగించి.. ఈ వ్యవహారంతో సంబంధమున్న కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు.
కొద్ది రోజుల క్రితం వ్యవసాయ శాఖలో ఏడుగురు అసిస్టెంట్ డైరెక్టర్స్ సదరు మంత్రిపై ఆరోపణలు చేస్తూ రాష్ట్ర గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. రూ.6 నుంచి 8 లక్షల వరకు లంచం ఇవ్వాలని మంత్రి అనుచరులు తమను డిమాండ్ చేశారని గవర్నర్‌కు తెలిపారు. ఈ వ్యవహారంపై విచారణ జరపాలంటూ గవర్నర్ ఆదేశాలు జారీచేశారు. ఈ నేపథ్యంలో మండ్య జిల్లా కేంద్రంలో మంత్రి ఫొటోతో పోస్టర్లు వెలువడటం తీవ్ర కలకలం రేపింది.