Venezuela | వెనెజువెలాపై అమెరికా సైన్యం చేసిన దాడిలో కనీసం 40 మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా వెనెజువెలాకు చెందిన ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. మృతుల్లో సైనికులతో పాటు సాధారణ పౌరులు కూడా ఉన్నారని చెప్పారు. వెనెజువెలాపై భారీ దాడి అనంతరం అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన సతీమణి సిలియా ఫ్లోరెస్‌ను అదుపులోకి తీసుకున్నట్లుగా పేర్కొన్నారు.
కాగా, వెనెజువెలాపై చేసిన దాడిలో తమవైపు ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. కేవలం కొద్దిమంది మాత్రమే గాయపడ్డారని తెలిపారు. ఇది అత్యంత సంక్లిష్టమైన ఆపరేషన్ అని పేర్కొన్నారు. మనవైపు ప్రాణనష్టం లేకుండా ఇంత పెద్ద ఆపరేషన్ పూర్తి కావడం ఆశ్చర్యకరమని వ్యాఖ్యానించారు. ఈ దాడిలో అనేక విమానాలు, హెలికాప్టర్లు, ఫైటర్ జెట్లు పాల్గొన్నాయని వెల్లడించారు. సాధారణంగా చొరబడలేని ప్రాంతాల్లోకి ప్రవేశించి, ఈ క్లిష్టమైన ఆపరేషన్ నిర్వహించామని చెప్పారు. వెనెజువెలా ప్రజలకు స్వేచ్ఛ కల్పించడమే అమెరికా లక్ష్యమని ట్రంప్ స్పష్టం చేశారు.
వెనెజువెలా దేశంపై దాడి చేసి అధ్యక్షుడు నికొలస్ మదురో, అతని భార్య సిలియా ఫ్లోరస్‌ను అగ్రరాజ్యం అమెరికా బందీగా పట్టుకుని న్యూయార్క్ నగరానికి తీసుకుపోయిన క్రమంలో ఆ దేశ రాజధాని కారకాస్, పొరుగున ఉన్న నగరాల్లో తీవ్ర భయం, ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ఆహారం కోసం పెద్దయెత్తున ప్రజలు బారులు తీరారు. పలు చోట్ల అంధకారం అలముకుంది. ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించింది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న భయంతో చాలామంది ఇండ్లకే పరిమితమై పోయారు. చాలా సూపర్మార్కెట్లు మూతపడ్డాయి. తెరిచి ఉంచిన చిన్నచిన్న దుకాణాల వద్ద 500-600 మంది బారులు తీరారు.
ముఖ్యంగా ముందు జాగ్రత్తగా బ్రెడ్ దుకాణాల వద్ద జనం పెద్దయెత్తున చేరుకున్నారు. అలాగే మందుల షాపుల వద్ద కూడా ప్రజలు ఎక్కువగా కన్పించారు. ఔషధాలతో పాటు అక్కడ అమ్మే కేన్డ్ ఫుడ్‌ను వారు కొనుగోలు చేయడం కన్పించింది. ప్రజలు తమ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల చార్జింగ్ కోసం ఎగబడ్డారు. కాగా, అక్కడ స్పల్ప సంఖ్యలో ఉన్న భారతీయ కమ్యూనిటీ కోసం భారత ఎంబసీ ఒక వాట్సాప్ గ్రూప్‌ను సృష్టించింది. దాని ద్వారా భారతీయులకు ఎప్పటికప్పుడు సూచనలు, ఆదేశాలు అందజేస్తున్నది.
అమెరికా దాడుల్లో పవర్ గ్రిడ్స్ దెబ్బ తినడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్తు లేక అంధకారం అలముకుంది. కమ్యూనికేషన్ వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అమెరికా దళాలు కారకాస్ ఎయిర్‌పోర్టుపై కూడా దాడి చేయడంతో రాజధాని నుంచి 100 కి.మీ వరకు ఎలాంటి వైమానిక ప్రయాణ సౌకర్యం లేకుండా పోయిందని భారత సంతతికి చెందిన సునీల్ మల్హోత్రా అనే స్థానికుడు తెలిపారు. ప్రజలు ఆహారం కోసం అల్లాడుతున్నారని, షాపుల వద్ద పెద్దపెద్ద క్యూలు ఏర్పడ్డాయని, పౌరుల్లో భయం, అనిశ్చితి, ఆందోళన నెలకొందని చెప్పారు. ఫ్యూర్టే ట్యూయనా వద్ద అధిక నష్టం వాటిల్లిందన్నారు.
కాగా, విద్యుత్తు స్తంభాల నుంచి అక్రమంగా వైర్లను లాగి కొందరు ఫోన్లకు చార్జింగ్ చేసే వ్యాపారం ప్రారంభించారు. ప్రస్తుత పరిస్థితులపై స్థానిక సంస్థలు కానీ, ప్రభుత్వం కానీ ప్రజలకు ఎలాంటి ప్రకటనలు, సూచనలు చేయలేదు. అధికారులు కూడా పూర్తి అనిశ్చితి పరిస్థితుల్లో ఉన్నారు. అయితే అక్కడక్కడ పోలీసులు పరిస్థితులను నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పౌరులు బయటకు రావడానికే భయపడుతున్నారని మల్హోత్రా తెలిపారు.