దేశంలో జరుగుతున్న ప్రజావ్యతిరేక పాలనపై యువత తప్పకుండా స్పందించే సమయం వస్తుందని కేసీఆర్ రెండేండ్ల క్రితం అన్నారు. ఇండియా రియాక్ట్స్ అంటూ ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. కేసీఆర్ చెప్పిన మాటలు నేడు అక్షర సత్యాలని నిరూపితమవుతున్నది. జంతర్ మంతర్‌లో విద్యార్థుల నిరసన ఉద్యమం తాజా నిదర్శనం. నాడు ఈస్టిండియా పాలకుల దోపిడీని ప్రతిఘటిస్తూ గాంధీజీ నాయకత్వాన అహింసా ఉద్యమం ప్రబలినట్టే నేడు యువత పోరాటబాట పట్టింది. బీజేపీ పన్నెండేండ్ల పాలనలో ప్రకృతి వనరులు, ప్రభుత్వ భూములు, సంస్థలు, అడవులు, అయోధ్య రామాలయ విరాళాల దోపిడీ వ్యవహారాలు వెలుగుచూశాయి.
లక్షల కోట్ల రూపాయల బ్యాంకు రుణాల ఎగవేతలు యథేచ్ఛగా జరిగాయి. 152 సార్లు పబ్లిక్ పరీక్ష ప్రశ్నాపత్రాలను కూడా అమ్ముకుతింటున్న ముఠాల వ్యవహారం బయటపడింది. దేశంలో సాగుతున్న నిత్య దోపిడీని ప్రతిఘటిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ నాయకత్వాన నిరసన ఉద్యమం ప్రజ్వరిల్లింది. దీన్ని కప్పిపెట్టేందుకు జాతీయ మీడియా చెమటోడ్చింది. అయినాసరే జర్నలిస్టులు, సోషల్ మీడియా ప్రతినిధులు, యువత, విద్యార్థులు ఉద్యమాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఉద్యమంలో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి లక్షలాది విద్యార్థులు చేరుకున్నారు.
ఆకాశం కప్పుకింద, దిక్కుల గోడల మధ్య, నేలపైనే నిద్రిస్తూ నిరసన తెలిపారు. ఆన్లైన్ ఆర్డర్ల ద్వారా ఆ బిడ్డలకు అన్నపానీయాలను పంపడం, డాక్టర్లు ఉచిత వైద్యసేవలు, మందులు అందించడం వంటి వీడియోలు వైరల్‌గా మారాయి. వివిధ మతాల పెద్దలు తమ ప్రార్థనా మందిరాల్లో నిరసనకారులు సేదదీర్చుకునేలా ఏర్పాట్లు చేయడం, రాత్రిపూట విద్యార్థులకు విసనకర్రలతో స్థానికులు సేవలు అందించడం, అన్ని మతాల ప్రజలు కలసికట్టుగా నినదిస్తూ ఉద్యమించడం వంటి దృశ్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. బీజేపీపై ఉద్యమం అంటే భయంతో వెనుకంజవేసేవాళ్లకు కూడా ఆత్మైస్థెర్యాన్ని కలిగించాయి.
మేం భారతీయులం మేమంతా ఒక్కటే అంటూ కుల, మత, ప్రాంతాలకు అతీతంగా యువతరం కదం తొక్కింది. శభాష్ విద్యార్థులారా! యువతీయువకులారా! భారతమాతకు అద్భుతమైన బిడ్డలు అని చాటిచెప్పారు. హేమాహేమీ రాజకీయ పార్టీల నేతలు సైతం జంకుతుంటే, నిర్భయంగా నిరసన గళమెత్తిన వీరులుగా నిలిచారు. ఎదురించేవాళ్లు లేనంతకాలం, బెదిరించేవారిదే రాజ్యం అనేది నానుడి. కానీ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడిన రైతులు, పేపర్ లీకేజీలపై ఉద్యమించిన విద్యార్థులు దేశానికి దిశానిర్దేశం చేశారు. నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోయిన భారతీయులందరికీ మార్గదర్శకులుగా నిలిచారు.
ప్రజావ్యతిరేక విధానాలతో మోదీ ప్రభుత్వం నానాటికీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోతున్నది. జంతర్ మంతర్ ఉద్యమమే కాదు, నిన్నటి ఉపఎన్నికల ఫలితాలూ అందుకు సాక్ష్యాలే. ముఖ్యంగా 1995 నుంచి బీజేపీకి వరుస విజయాలను అందిస్తూ వచ్చిన బిహార్‌లోని బాంకీపూర్ నియోజకవర్గంలో జరిగిన ఉపన్నికలో బీజేపీ పరాజయం అందుకు సుస్పష్ట సంకేతం.
గుజరాత్లో జరిగిన ఒక ఉపఎన్నికలో బీజేపీ గెలిచినా, గత ఎన్నికలో సాధించిన లక్ష మెజారిటీ కాస్త, 30 వేలకు పడిపోయింది. ప్రజలు తమ పట్ల ఆగ్రహంగా ఉన్నారనే సంగతి మోదీకి, ఆయన అంధభక్తులు, వీరాభిమానులు గుర్తించే ఉంటారు. అయినా అధికార అహంకారం తప్ప, ఏమాత్రం సామాజిక స్పృహ చూపడంలేదు. క్షేత్రస్థాయిలో వాస్తవాలను అంగీకరించడంలేదు. ప్రశ్నించిన వాళ్లను బూతులతో ట్రోల్ చేస్తున్నారు. అలాంటి విద్వేషపూరిత వ్యక్తులు ఇప్పటికైనా మాజీ ప్రధాని, అటల్ బిహారీ వాజపేయి సూచనను తెలుసుకోవాలి, గుర్తుచేసుకోవాలి. నీ అభిమాన పార్టీ చేస్తున్న తప్పుల పట్ల మౌనం వహిస్తే, అప్పుడు నువ్వు దేశ ప్రేమికుడివి కాదు. పార్టీ ప్రేమికుడివి మాత్రమే. పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి. దేశమే శాశ్వతం. దేశం కోసం పార్టీ తప్పుల్ని ప్రశ్నించాలి. అవసరమనుకుంటే ప్రతిఘటించాలి. అవీ వాజపేయి చెప్పిన మాటలు.
ప్రజావ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలను అమలుపరుస్తున్న మోదీ ప్రభుత్వం, ప్రజల దృష్టిని మరల్చేందుకు పథకం ప్రకారం వ్యవహరిస్తున్నది. మోదీ విధానాలు అన్నీ కూడా దేశం కోసం-ధర్మం కోసం అంటూ కార్పొరేట్ మీడియా, వాట్సాప్ యూనివర్సిటీ, సంఘ్ పరివార్ కార్యకర్తలు, ఆయన అంధభక్తులు నిత్యం హోరెత్తిస్తున్నారు. ప్రశ్నిస్తే అరెస్టులు, నిలదీస్తే దేశద్రోహి అంటూ నిందలు వేస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా గళం వినిపించే ప్రతిపక్ష పార్టీల నేతలపై ఈడీ, ఐటీ, సీబీఐ కేసులతో మోదీ ప్రభుత్వం వేధిస్తున్నది. అడవులు నరికి ప్రకృతి సంపదను స్వాధీనం చేసుకోవడానికి అడ్డుగా ఉన్న గిరిజనులను హింసాత్మక పద్ధతులతో అణచివేస్తున్నది. మీడియా, ఎన్నికల కమిషన్ వంటి వ్యవస్థలను పూర్తిగా రిమోట్ కంట్రోల్‌తో నడిపిస్తున్నది.
ఎన్నికలకు ముందుగా పుల్వామా, పహల్గాం, సర్జికల్ స్ట్రైక్స్, పాకిస్థాన్ ఉగ్రవాదం, చైనా దురాక్రమణ వంటి భావోద్వేగమైన అంశాలతో ఓటర్లను ఆకట్టుకోవడం, తాము చేసే ప్రజావ్యతిరేక చట్టాల ఆమోదం కోసం త్రిశూలదాడులు, కేసులకు లొంగివచ్చిన వారికి తమ కండువా కప్పుతూ, ఏక్నాథ్ షిండే మాడల్‌లో ప్రభుత్వాల్లో చీలికలు సృష్టించడం, బీజేపీలో విలీనం చేసుకోవడం ద్వారా తన బలం పెంచుకుంటున్నది. ఉత్తర భారత ఓటర్లలా మతతత్వానికి లొంగని దక్షిణ భారత ఓటర్లతో, వాళ్ల ఎంపీలతో పనిలేకుండానే రాజ్యాధికారం కైవసం చేసుకోవడానికి వీలుగా నియోజకవర్గాల పునర్విభజన, జమిలీ ఎన్నికల విధానాన్ని తెరపైకి తీసుకొస్తున్నది. మరోవైపు ఎన్నికల కమిషన్ సహకారంతో తమకు వ్యతిరేకంగా ఉన్న రాష్ర్టాల్లో ఓటర్లను తొలగిస్తున్నది. మరోవైపు ఈవీఎంలతో మాయాజాలం చేస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అధికారం కోసం బీజేపీ ఇంతటి పకడ్బందీ కుట్రపూరిత ప్రణాళికలను అమలు చేస్తూ అజేయులమన్న ధీమాతో ఉన్నది. కానీ జంతర్ మంతర్ మీదుగా లక్షలాది విద్యార్థులు ప్రభుత్వంపైకి పిడుగుల్లా వచ్చిపడ్డారు. సరే తమ విధానాలను మార్చుకోవటానికి ఇష్టపడని ప్రభుత్వం, న్యాయం కోసం పోరాడుతున్న ఆ బిడ్డలపై క్రూరాతిక్రూరమైన అణచివేత చర్యలకు పూనుకొన్నది.
మోదీ ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు, గుర్తుతెలియని గూండాలు ఆడామగ, చిన్నాపెద్ద తేడా లేకుండా పెల్లెట్గన్లు, మేకులు కొట్టిన లాఠీలతో చితగ్గొట్టారు. తలల నుంచి కారుతున్న రక్తంతో ఆర్తనాదాలు పెడుతున్న ఆ పిల్లలను చూస్తూ కూడా చలించని మోదీ, తనను దూషించారంటూ ఆవేదనతో వీడియో విడుదల చేశారు. నన్ను తిట్టిన ఆ బిడ్డల్ని క్షమిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు. ఈ ధోరణి చూసి యావత్తు దేశ ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. విద్యార్థులను చితక్కొట్టించి, మళ్లీ క్షమించడమేంటో విడ్డూరం అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రధాని ఇకనైనా ప్రజావ్యతిరేక విధానాలను వీడాలి. దేశమంటే కార్పొరేట్లు మాత్రమే కాదని, కోట్లాది ప్రజలు అనే విషయం గ్రహించాలి.
– పాతూరి వెంకటేశ్వర్రావు